స్పీకర్ సంచలన వ్యాఖ్యలు : నా పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉంది 

  • Publish Date - February 13, 2019 / 11:23 AM IST

కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడిందబ్బా. తన పరిస్థితిని వివరిస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలతో తనను ప్రలోభపెట్టాలని యత్నించారనే వివాదాస్పద ఆడియో టేప్‌పై  స్పీకర్ రమేశ్ కుమార్  మాట్లాడుతూ.. తన పరిస్థితి రేప్ బాధితురాలిలా తయారైందని..బాధితురాలు ఒకసారి అత్యాచారానికి గురైతే..కోర్టులో నిందితుడి తరపు న్యాయవాది రేప్ ఎలా జరిగింది? ఎంత సేపు జరిగింది? అని గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టుగా ఉందని..తన పరిస్థితి అత్యాచార బాధితురాలికంటే అధ్వాన్నంగా ఉందని వాపోయారు.  

 

కర్ణాటక బడ్జెట్‌ సమావేశాల క్రమంలో ‘ఆపరేషన్‌ కమలం’కు సంబంధించిన ఆడియో టేపులను ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఈ ఆడియో టేపులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొందరు జనతాదళ్‌ ఎమ్మెల్యేలతో బేరాల విషయమై మాట్లాడుతుండగా రికార్డు చేసినట్లు కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బీఎస్ యడ్యూరప్ప-జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్‌గౌడ కంద్‌కూర్ కుమారుడు శరణగౌడ మధ్య జరిగిన సంభాషణ ఇందులో రికార్డు అయింది. మంగళవారం మొత్తం అసెంబ్లీలో ఇదే విషయమై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయటం మరో సంచలనంగా మారింది. ఎవరో ఏదో చేస్తే దానికి తనను రోడ్డు మీదికి తీసుకురావడం ఏంటని స్పీకర్ రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.