Lok Sabha: లోక్‌సభలో ఆగంతకుడి నుంచి గ్యాస్ టిన్ లాక్కున్నాను.. ఆ తర్వాత..: కాంగ్రెస్ ఎంపీ

లోక్‌సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.

Gurjeet Singh Aujla

Parliament: లోక్‌సభలో విజిటర్ గ్యాలరీలోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, గ్యాస్ స్ప్రే చేసి కలకలం రేపడం ఆందోళన కలిగిస్తోంది. ఆగంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

‘ఓ ఆగంతకుడి చేతిలో ఏదో ఉంది. దానిలో నుంచి పసుపు రంగు పొగలు వచ్చాయి. దాన్ని నేను లాక్కున్నాను. దాన్ని దూరంగా విసిరేశాను. లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యం మామూలుది కాదు’ అని గుర్జీత్ సింగ్ ఔజ్లా చెప్పారు.

కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ… ‘ఆ ఇద్దరు ఆగంతకులను ఇద్దరు ఎంపీలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆగంతకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇది అతి పెద్ద భద్రతా వైఫల్యం’ అని అన్నారు.

కాగా, పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు నిరసన తెలపడం కలకలం రేపింది. వారు కూడా పసుపు రంగు స్ప్రే కొట్టారు. భద్రతా సిబ్బంది వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.