తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన పెట్టిన ఓ పోస్ట్ చూసి.. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన స్వస్థలమైన యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు అందరూ భావించారు.
అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రస్తుతానికి తాను భావించడం లేదని సోమవారం(ఫిబ్రవరి-25,2019) తన పొలిటికల్ ఎంట్రీపై రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. దాన్ని నేను సాధించాలి అనే తొందరలో నేను లేను. దేశ ప్రజలకు సేవ చెయ్యాలంటే పాలిటిక్స్ లో ఉండాలని భావించడం లేదు. ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే పెద్ద మార్పుని తీసుకురాగలనని భావిస్తున్నాను, రాజకీయాల్లోకి రావాలా, వద్దా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విధంగా నేను పనిచేస్తున్నాను. మొదటిగా నాపై వచ్చిన అసత్యపు ఆరోపణల నుంచి నేను విముక్తి పొందాలి, నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు ఫీల్ అవ్వాలని వాద్రా తెలిపారు.
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?
ఆదివారం రాబర్ట్ వాద్రా తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ లో..ఇన్నేళ్ల అనుభం, నేర్చుకోవడం ఊరికే వేస్ట్ గా పోకూడదు. మంచి పనికి దాన్ని వాడాలి. నాపై వచ్చిన ఆరోపణలు,నిందలు అన్నీ ముగిసిపోయిన తర్వాత ప్రజాసేవకి జీవితాన్ని కేటాయించాలని భావిస్తున్నాను. ఏళ్లు,నెలల తరబడి ప్రచారంలో పాల్గొన్నాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ప్రజల కోసం ఇంకా చెయ్యాలని, నా వల్ల సాధ్యమయ్యే చిన్న చిన్న మార్పులు చెయ్యాలని భావించాను అని తెలిపారు.
దీంతో వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున మొరాదాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రియాంకా గాంధీని యూపీ కాంగ్రెస్ తూర్పు ఇన్ చార్జ్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన విషయం తెలిసిందే. బీఎస్పీ-ఎస్పీ కూటమిలోకి ఆహ్వానించకపోవడంతో ఒంటరిగా యూపీలో కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగబోతుంది.
మనీలాండరింగ్, భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా రాజకీయ ప్రస్తావన విషయం వచ్చిన ప్రతీసారీ అధికార బీజేపీ ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చింది. దేశంలోని వాస్తవ సమస్యలను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం తన పేరును హైలెట్ చేస్తుందని వాద్రా అన్నారు.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు