Rafale fighter jet
శత్రు ప్రాంతాలలోకి చొచ్చుకునిపోయి, టార్గెట్లు మిస్ కాకుండా వైమానిక దాడులను నిర్వహించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి భారత వైమానిక దళం అతి పెద్ద ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తోంది. ఇందులో రాఫెల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను కూడా భారత్ సైన్యం వాడుతోంది.
అంతేకాదు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌ను ఎదుర్కోవడానికి కూడా సన్నాహాలు చేసుకుంటోంది. అంటే, శత్రు దేశ సిగ్నల్స్‌ను జామ్ చేయడం, వాటికి అంతరాయం కలిగించడం వంటి వాటి కోసం ఎక్సర్‌సైజ్ చేస్తోంది. శత్రు దేశ కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తే మన యుద్ధవిమానాల ఆచూకీ వారికి తెలియదు.
దీంతో మన యుద్ధ విమానాలను పాక్ పసిగట్టలేదు.. భారత్ టార్గెట్లను సులభంగా ఛేదించి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తుండడం గమనార్హం. సెంట్రల్ ఇండియాలో “ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్” పేరిట ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్‌లో మనదేశ యుద్ధ విమానాల సన్నద్ధతను పరీక్షించడంతో పాటు శత్రు దేశ ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు అనుగుణంగా విన్యాసాలు చేస్తున్నారు.
రాఫెల్ జెట్‌లతో పాటు మనదేశానికి చెందిన వివిధ రకాల యుద్ధ విమానాలను ఈ విన్యాసాల కోసం తూర్పు సరిహద్దుల నుంచి సెంట్రల్ ఇండియాకు తరలించారు. అయితే, ఇది అంతర్గత విన్యాసం అని, పహల్గాం ఉగ్రవాద దాడికి ముందే ఈ ఎక్సర్‌సైజ్‌ను ప్రారంభించారని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఎల్‌ఈటీ కార్యాలయంపై దాడులు..?
ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఎస్‌సీఏఎల్‌పీ క్షిపణులను రాఫెల్ జెట్లు మోసుకెళ్లి వాటితో దాడులు చేస్తాయి.
శత్రు దేశంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి, దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులు చేసేందుకు భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాలు ఇవి. భూమి మీది టార్గెట్లను గగనతలం నుంచి ఇవి ఛేదిస్తాయి. రోస్టోవ్-నా-డోను జలాంతర్గామి, సెవాస్టోపోల్‌లోని ల్యాండింగ్ షిప్ సహా అనేక రష్యన్ టార్గెట్‌లను కూల్చివేసేందుకు ఉక్రెయిన్ కూడా ఈ క్షిపణులనే ఉపయోగించింది.
ఎస్‌సీఏఎల్‌పీ క్షిపణులతో కూడిన రాఫెల్ జెట్లతో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్ వంటి లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. ఇక్కడే ఎల్‌ఈటీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. రాఫెల్ జట్లు శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తాయి.. అలాగే, శత్రుదేశం నుంచి వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణులను కూల్చేయడానికి భారత్ ఎస్400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా మోహరించింది.
పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని 2019లో ట్రైనింగ్ క్యాంప్‌పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వద్ద సర్వీసులో లేవు. అప్పట్లో భారత్ మిరాజ్ 2000 జట్లను వాడింది.