IAF Aircraft : వీడిన మిస్ట‌రీ.. 2016లో గల్లంతైన ఏఎన్‌-32 విమాన శ‌క‌లాలు ల‌భ్యం

భార‌త వైమానిక ద‌ళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 అనే ర‌వాణా విమాన అదృశ్య మిస్ట‌రీ వీడింది.

IAFs An 32 Aircraft Debris Found After almost 8 Years

IAFs An 32 Aircraft Debris : భార‌త వైమానిక ద‌ళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 అనే ర‌వాణా విమాన అదృశ్య మిస్ట‌రీ వీడింది. దాదాపు ఏడేళ్ల క్రితం 29 మందితో అదృశ్య‌మైన ఈ విమానానికి చెందిన శ‌క‌లాల‌ను తాజాగా చెన్నై తీరానికి 310 కిలోమీట‌ర్ల దూరంలో క‌నుగొన్నారు.

2016 జూలై 22న ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఏఎన్‌-32 విమానం చెన్నైలోని తంబ‌ర‌న్ ఎయిర్ బేస్ నుంచి బ‌య‌లుదేరింది. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యానికి అండ‌మాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో ఈ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. కాగా.. బంగాళాఖాతం మీదుగా ప్ర‌యాణిస్తున్న ఆ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల త‌రువాత అదృశ్య‌మైంది.

రాడార్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి. విమాన ఆచూకీ కోసం దాదాపు మూడు నెల‌ల పాటు బంగాళాఖాతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టినా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో విమానం కూలిపోయి ఉంటుంద‌ని, అందులో ప్ర‌యాణించిన‌వారు మ‌ర‌ణించి ఉంటార‌ని ఐఏఎఫ్ అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 2016 సెప్టెంబ‌ర్ 15న ఆ 29 మంది కుటుంబాల‌కు లేఖ‌లు పంపించింది.

బంగాళాఖాతంలో తప్పిపోయిన విమానాన్ని గుర్తించడానికి, లోతైన సముద్ర అన్వేషణ కోసం ప్రారంభించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన అటానమస్ యుటిలిటీ వెహికల్ (ఏయూవీ) ఇటీవ‌ల ఈ విమానానికి సంబంధించిన శ‌క‌లాల ఫోటోల‌ను తీసింది. ఆ ఫోటోల‌ను బాగా విశ్లేషించిన త‌రువాత అది ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-32 విమానానికి చెందిన శ‌క‌లాలు నిర్థారించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కూలిపోయినట్లు గుర్తించారు.

PM Modi : అతి పొడ‌వైన స‌ముద్ర‌పు వంతెన‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.. 2గంట‌ల ప్ర‌యాణం కాస్త 20 నిమిషాల్లో..
కాగా.. ఆ ప్రాంతంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విమానం కూలిన ఘ‌ట‌న‌లు లేక‌పోవ‌డంతో ఐఏఎఫ్ ఏఎన్‌-32 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.