Remdesivir : ఈ చిన్నపాటి జాగ్రత్తలతో.. నకిలీ రెమ్‌డెసివిర్‌ను ఇట్టే గుర్తించొచ్చు..

Identify Fake Remdesivir

Identify Fake Remdesivir : కరోనా రోగులకు అందించే వైద్య చికిత్సలో అత్యంత కీలకంగా మారిన డ్రగ్ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్. ఇదో యాంటీ వైరల్ డ్రగ్. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరగడంతో.. మార్కెట్‌లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు మెడికల్‌ మాఫియా రంగంలోకి దిగింది. నకిలీ అవతారం ఎత్తింది. అసలైన ఇంజక్షన్లు ఇవే అనేలా నకిలీలను తయారు చేసి అమ్మేస్తున్నారు. పాపం, కొందరు అమాయకులు నిజం తెలియక వాటిని కొనేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ అని తెలిసి లబోదిబో మంటున్నారు.

డబ్బు పోయినా పర్లేదు, కానీ, నకిలీ మందుల కారణంగా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏది అసలైనవి, ఏవి నకిలీవి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కొద్దిపాటి జాగ్రత్తలతో నకిలీవి ఏవో అసలైనవి ఇట్టే గుర్తించవచ్చు. అందుకు ఇవి ఫాలో అయితే సరిపోతుంది…

* ఒరిజినల్‌ దానిలో రెమ్‌డెసివిర్‌ అని రాసినచోట పైన ఆర్‌ఎక్స్‌(Rx) అని ఉంటుంది. నకిలీలో ఇది ఉండదు.
* ఇంజక్షన్‌ పేరులో 100 mg/Vial అన్న చోట వీ(V) క్యాపిటల్‌ లెటర్‌ ఉంటుంది. నకిలీ దాంట్లో స్మాల్ లెటర్(v) ఉంటుంది.
* మరో మూడు చోట్ల క్యాపిటల్‌ లెటర్‌ బదులు స్మాల్‌ లెటర్స్‌ ఉంటాయి.
* డబ్బా వెనుక భాగంలో వార్నింగ్‌ అన్నది అసలైనదైతే ఎరుపు రంగులో, నకిలీ దాంట్లో నలుపు రంగు అక్షరాల్లో ఉంటుంది.
* తెలంగాణ స్టేట్‌ అన్నది నకిలీలో అక్షర దోషాలతో(Telagana) ఉంటుంది.
* ఒరిజనల్ దానిపై వార్నింగ్ లేబుల్ కింద కోవిఫిర్(బ్రాండ్ నేమ్) అని ఉంటుంది.. నకిలీ దానిపై ఉండదు.
* ఒరిజినల్ దాని మీద India అని ఉంటుంది. ఫేక్ దాని మీద india అని ఉంటుంది.

యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ ను కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల చికిత్సకు వినియోగిస్తున్నారు. ఈ మెడిసిన్.. వైరల్ లోడ్ ని తగ్గించడంలో తోడ్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఈ డ్రగ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో కేటుగాళ్లు రంగంలోకి దిగి నకిలీ మందులతో దోచుకుంటున్నారు. ఇక ముందు.. ఈ జాగ్రత్తలు గుర్తు పెట్టుకుంటే ఏది నకిలీ ఏది ఒరిజనల్ అన్నది ఇట్టే గుర్తించొచ్చు.