ఇండియా, పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి సత్తా ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్… ఎవరి వద్ద ఎన్ని?

భారత్ - పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఆర్మీ, నేవీ, ఎయిరో ఫోర్స్ లలో ఎవరి బలం ఎంత.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

India Army

India Defence Forces: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్.. ఆ దేశానికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. అవసరమైతే యుద్ధానికిసైతం వెనుకాడేదిలేదన్న సంకేతాలు ఇస్తోంది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ ఆర్మీల బలాబలాలు తెలుసుకుందాం.

 

రక్షణ బడ్జెట్..
◊ భారతదేశం రక్షణ రంగం బడ్జెట్ 2025-26 సంవత్సరానికి రూ. 6.8 లక్షల కోట్లు ($ 79 బిలియన్లు) గా నిర్ణయించబడింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 9.5% ఎక్కువ.
◊ పాకిస్థాన్ రక్షణ రంగం బడ్జెట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 159 బిలియన్లు పెంచుతుందని, మొత్తం కేటాయింపులు రూ. 2,281 బిలియన్లకు చేరుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి.

 

సైనిక బలం..
◊ గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్-2025 ప్రకారం.. సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ పన్నెండవ స్థానంలో ఉంది.
◊ భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులు ఉన్నారు. 1,155,000 మందితో రిజర్వ్ ఫోర్స్ ను కలిగి ఉంది. 2,527,000 పారామిలిటరీ దళాలను కలిగి ఉంది.
◊ పాకిస్థాన్ సైన్యం 6,54,000 మంది సైనికులను కలిగి ఉంది. రిజర్వ్ ఫోర్స్ 550,000 మందితోపాటు 5లక్షల పారామిలిటరీ దళాలను కలిగి ఉంది.
◊ భారతదేశం వద్ద 4,201 ట్యాంకర్లు ఉండగా, పాకిస్తాన్ వద్ద 2,627 ఉన్నాయి. భారతదేశం T-90 భీష్మ, అర్జున్ ట్యాంకర్లు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థలను కూడా కలిగి ఉంది.
◊ భారతదేశంలో 148,594  ఆయుధాలు కలిగిన వాహనాలు ఉన్నాయి, ఇది పాకిస్తాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ.

వైమానిక దళం..
◊ భారతదేశం వద్ద 2,229 విమానాలు ఉన్నాయి. వీటిలో ఫైటర్ ఎయిర్‌క్రాప్ట్స్‌513, డెడికేటెడ్ అటాక్ ఎయిర్‌క్రాప్ట్స్‌130, రవాణా కోసం వినియోగించే ఎయిర్‌క్రాప్ట్స్‌ 270 ఉన్నాయి. శిక్షకులు 351 మంది ఉన్నారు. స్పెషల్ – మిషన్స్ 74, ఏరియల్ ట్యాంకర్లు 6, ఎయిర్‌క్రాప్ట్స్‌ 899, ఎటాక్ ఎయిర్‌క్రాప్ట్స్‌ 80 ఉన్నాయి.
◊ పాకిస్తాన్ వద్ద మొత్తం 1,399 విమానాలు ఉన్నాయి. వాటిలో ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ 328, డెడికేటెడ్ అటాక్ ఎయిర్‌క్రాప్ట్స్‌ 90, రవాణా వ్యవస్థకు సంబంధించి ఎయిర్‌క్రాప్ట్స్‌ 64, శిక్షకులు 565, స్పెషల్ -మిషన్స్ 27, ఏరియల్ ట్యాంకర్లు 4, ఎయిర్‌క్రాప్ట్స్‌ 373, ఎటాక్ ఎయిర్‌క్రాప్ట్స్‌ 57 కలిగిఉంది.

నేవీ విభాగం..
◊ భారతదేశం బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఆర్థిక, భద్రతా ప్రయోజనాలతో కూడిన పొడవైన సముద్ర తీరాలను కలిగి ఉంది.
◊ పాకిస్థాన్ అరేబియా సముద్రం వెంబడి మాత్రమే సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.
◊ భారతదేశం నేవీ విభాగంలో పాకిస్థాన్ కంటే చాలా బలోపేతంగా ఉంది.
◊ ఇండియన్ నేవీ 293 నౌకా దళాలను కలిగి ఉంది. పాకిస్థాన్ 121 నౌకా దళాలను కలిగి ఉంది.
◊ భారత్ రెండు విమాన వాహక నౌకలు (INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్) కలిగి ఉంది. జలాంతర్గాములు (సబ్ మెరైన్స్) 18, డిస్ట్రాయర్లు 13, ఫ్రిగైట్స్ 14, కార్వెట్ నౌకలు (చిన్న వార్ షిప్ లు) 18, పెట్రోల్  వాహనాలు 135 ఇండియన్ నౌకా దళంలో ఉన్నాయి.
◊ పాకిస్థాన్ నేవీ విభాగం 121 నౌకా దళాలను కలిగి ఉంది. వీటిలో జలాంతర్గాములు 8, ఫ్రిగెట్స్ 9, కార్వెట్ నౌకలు 9, పెట్రోల్ వాహనాలు 69, మైన్ వార్‌ఫేర్స్ మూడు కలిగి ఉంది.