IISC: సూది గుచ్చకుండానే షుగర్ పరీక్ష.. ఐఐఎస్సీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
బెంగళూరులోని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు కాంతి మరియు ధ్వనిపై ఆధారపడిన సూది రహిత గ్లూకోజ్ పరీక్షను అభివృద్ధి చేశారు.

IISc develops non-invasive
IISc: షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది. అయితే, మధుమేహులు ఒకరోజులో పలుసార్లు ఈ పరీక్ష చేసుకోవాల్సి రావొచ్చు. ఇలా పదేపదే సూదులతో గుచ్చడం వల్ల బాధితులకు అసౌకర్యంగా ఉంటుంది. దీని ద్వారా ఇన్ ఫెక్షన్ల ముప్పుకూడా పెరగొచ్చు. అయితే, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు.
బెంగళూరులోని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు కాంతి మరియు ధ్వనిపై ఆధారపడిన సూది రహిత గ్లూకోజ్ పరీక్షను అభివృద్ధి చేశారు. ఫోటోఅకౌస్టిక్ సెన్సింగ్ ఉపయోగించి, చర్మాన్ని గుచ్చకుండా శరీరం లోపల గ్లూకోజ్ సాంద్రతను కొలవడానికి లేజర్ కిరణాలను ఉపయోగించే కొత్త పద్ధతి ఇది.
కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికోసం ఫొటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు. ఇది ఒకరమైన కాంతి తరంగం. ఒక నిర్దిష్ట పరిదిలోనే కంపిస్తూ ఉంటుంది.
ఫొటో అకౌస్టిక్ సెన్సింగ్ విధానం ద్వారా లేజర్ కాంతిని ఒక జీవ కణజాలంపైకి ప్రసరింపచేసినప్పుడు కణజాలంలోని భాగాలు కాంతిని శోషించుకుంటాయి. ఫలితంగా కణజాలం స్వల్పంగా (1 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ) వేడెక్కుతుంది. దీనివల్ల కణజాలం సంకోచించి ఆ తరువాత వ్యాకోచిస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి ప్రకంపనలు వెలువడతాయి. అవి ఆల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల రూపంలో ఉంటాయి. వీటిని సున్నితమైన డిటెక్టర్లు పసిగట్టి సమాచారం అందిస్తాయి. ఈ విధానంలో సంబంధిత కణజాలానికి నష్టం కలగదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
వివిధ పద్దతుల్లో పరీక్షను విజయవంతంగా నిర్వహించిన తరువాత.. పరిశోధకులు ఆరోగ్యవంతులైన కొందరు మనుషులపై పైలట్ ప్రాజెక్టుగా పరిశోధనలు చేశారు. మూడు రోజుల పాటు భోజనానికి ముందు, తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఫొటో అకౌస్టిక్ సెన్సింగ్ విధానం ద్వారా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో గ్లూకోజ్ స్థాయిల మార్పులను కచ్చితత్వంతో ట్రాక్ చేసినట్లు పరిశోధకులు నిర్ధారించారు.
అయితే, ఈ ప్రయోగం కోసం ఉపయోగిస్తున్న లేజర్ సాధనం చాలా చిన్నపాటి నానోసెకండ్ ప్రకంపనలను సృష్టించాలి. అందువల్ల అది చాలా భారీగా, అధిక ధరను కలిగి ఉంటుంది. వైద్య అవసరాల కోసం వీటిని వాడాలంటే ఈ యంత్రాల పరిమాణాన్ని తగ్గించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు వివరించారు.