రామాయణంలోని ఘట్టాలను అనుకరిస్తూ స్కిట్.. ఐఐటీ విద్యార్థులకు రూ.1.2 లక్షల చొప్పున ఫైన్

'రాహోవన్' పేరిట స్కిట్ వేశారు. రామాయణ ఇతివృత్తం ఆధారంగా ఆ ప్రదర్శన..

ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్లో ఓ స్కిట్ వేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రామాయణాన్ని ఆ విద్యార్థులు అపహాస్యం చేసేలా ఈ స్కిట్ వేశారని ఓ వర్గం విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఐఐటీ బాంబే చర్యలు తీసుకుంది.

ఆ స్కిట్ వేసిన ప్రతి విద్యార్థికి రూ.1.20 లక్షల చొప్పున ఫైన్ వేసింది. ఈ ఏడాది మార్చి 31 ఐఐటీ బాంబేలో ఫెస్ట్ నిర్వహించారు. అందులో కొందరు విద్యార్థుల ‘రాహోవన్’ పేరిట స్కిట్ వేశారు. రామాయణ ఇతివృత్తం ఆధారంగా ఆ ప్రదర్శన జరిగింది. రామాయణంలోని అరణ్యకాండలోని కొన్ని ఘట్టాలను పోలిన స్కిట్ వేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఆ స్కిట్లో విద్యార్థుల భాషతో పాటు హావభావాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోట్లాది మంది ఎంతో పవిత్రంగా చూసే రామాయణాన్ని ఆ విద్యార్థులు కించపర్చారని చాలా మంది మండిపడ్డారు. ఐఐటీ బాంబేలోని క్రమశిక్షణా కమిటీ ఆ విద్యార్థుల స్కిట్ పై దర్యాప్తు చేసింది.

తాజాగా ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంది. స్కిట్ వేసిన వారిలో సీనియర్లకు ప్రతి ఒక్కరికీ రూ.1.2 లక్షల చొప్పున ఫైన్ వేయడమే కాకుండా వారు జింఖానా అవార్డులు తీసుకునేందుకు ఇకపై అనర్హులని ప్రకటిచింది. అలాగే, స్కిట్లో పాలు పంచుకున్న జూనియర్ విద్యార్థులకు కూడా రూ.40 వేల చొప్పున ఫైన్ వేశారు. వారికి హాస్టల్ సౌకర్యాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Also Read: మోకాళ్లపై కూర్చొని అమరావతి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లిన చంద్రబాబు.. వీడియో

ట్రెండింగ్ వార్తలు