ఢిల్లీలో రెడ్అలర్ట్ జారీ.. మూతపడ్డ పాఠశాలలు.. పలు విమానాలు రద్దు

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Delhi Rain

Heavy Rains In Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతోపాటు కుండపోత వర్షం కురవడంతో ఢిల్లీకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Also Read : Wayanad Landslides : వయనాడ్ విలయం.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం ఫైర్

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 22ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె ప్రమాదవశాత్తూ ఘాజీపూర్ ప్రాంతంలో డ్రైనేజీలో పడి మరణించారు. భారీ వర్షం కారణంగా రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. విద్యాశాఖ మంత్రి అతిషి ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ -నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో కూడా భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్దీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read : సీఎం రేవంత్‌తో పాటు అమెరికా వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల తహతహ.. కారణం ఏంటి?

ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లుకూలి వ్యక్తికి గాయాలయ్యాయి. వసంత్ కుంజ్ లో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. కుండపోత వర్షం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ వెళ్లే 10 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు