Cyclone Mocha(Photo : Google)
Cyclone Mocha : ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అందివచ్చిన పంట నీటమునగడంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇది చాలదన్నట్లు మరో కష్టం వచ్చింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తుపాను ముప్పు హెచ్చరికలు చేసింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 7 వరకు ఆవర్తనం బలపడి అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయంది. ఈ నెల 8 లేదా 9వ తేదీ వరకు మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్‌లో బంగాళాఖాతంలో తరచుగా తుపానులు ఏర్పడతాయి. మే నెలలో వీటి ముప్పు మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపాను ఏర్పడితే దానికి సైక్లోన్ మోచా అని పేరు పెట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పేరుని యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలోని రెడ్ సీ పోర్ట్ సిటీ పేరే మోచా. తుపానుకి ఆ పేరు సూచించారు. వచ్చే వారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటీవలి సంవత్సరాలలో 2020లో అంఫాన్, 2021లో అసని, 2022లో యాస్‌తో సహా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన చాలా తుపానులు మే నెలలో తీరాన్ని తాకాయి.
సైక్లోన్ మోచా కదలిక గురించి ఎటువంటి అంచనా లేనప్పటికీ, పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలపై దాని ప్రభావం ఉండొచ్చని అంచనా. తుపాను వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, తుఫాను వచ్చే వారం మంగళవారం బంగాళాఖాతం మీదుగా వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా ఉత్తరం వైపుగా, భారత తీరప్రాంతానికి దగ్గరగా కదులుతుందని భావిస్తున్నారు.
IMD-గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (GFS) ప్రకారం, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడుతున్న అల్పపీడనం మే 9న అండమాన్ దీవుల సమీపంలో తుపాన్ గా మారనుంది. మే 11 వరకు తుపాను ఉత్తర-ఈశాన్య దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఇకపోతే.. ఈ సంవత్సరంలో ఇదే తొలి సైక్లోన్ కానుంది.