Ice Cream Adulteration : పిల్లలకు ఐస్‌క్రీమ్స్ కొనిస్తున్నారా? అయితే బీ కేర్‌ ఫుల్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

Ice Cream Adulteration : కల్తీ ముడిసరుకులు, విషపూరిత రంగులు, హానికారక రసాయనాలు, అపరిశుభ్ర వాతావరణం, ఎక్కడపడితే అక్కడ క్రిములు, కీటకాలు..

Ice Cream Adulteration : పిల్లలకు ఐస్‌క్రీమ్స్ కొనిస్తున్నారా? అయితే బీ కేర్‌ ఫుల్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

Ice Cream Adulteration

Ice Cream Adulteration : కల్తీ..కల్తీ..కల్తీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏది ముట్టుకున్నా ఇదే మాట వినిపిస్తోంది. కేటుగాళ్లు, అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మార్కెట్ లో అన్నింటిని కల్తీ చేసేస్తున్నారు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను ఐస్ క్రీమ్ పై పడింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. ఇక, అసలే సమ్మర్. ఇంకేముంది ఐస్ క్రీమ్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే అదనుగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ లను మార్కెట్ లో విక్రయిస్తున్నారు.

కల్తీ ఐస్ క్రీమ్స్. తెలంగాణలో ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న మాట ఇది. కల్తీ ఐస్ క్రీమ్స్ దందా జోరుగా నడుస్తోంది. అక్రమార్కులు దర్జాగా వ్యాపారం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీమ్ కొని, తిన్న వారు అనారోగ్యం బారినపడుతున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఐస్ క్రీమ్ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సిందే. లేదంటే, జబ్బుల బారిన పడటం ఖాయం.

వివిధ బ్రాండ్స్ పేరుతో అమ్ముతున్న ఐస్ క్రీమ్స్ తయారీలో కేటుగాళ్లు కల్తీకి పాల్పడుతున్నారు. అక్రమార్జన కోసం వక్రమార్గాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పోలీసుల దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం ముడిపదార్దాలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు.

Also Read..Ice Cream : లొట్టలేసుకుని మరీ ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? బీ కేర్‌ఫుల్

అమన్‌గల్‌లో ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఎస్వోటీ పోలీసులు భారీగా కల్తీ ఐస్ క్రీమ్స్ గుర్తించారు. కల్తీ ముడిసరుకులు, విషపూరిత రంగులు, హానికారక రసాయనాలను ఉపయోగించి ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాక్టరీలో అపరిశుభ్ర వాతావరణంలో ఇవి తయారవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ క్రిములు, కీటకాలు వాలుతున్నాయి. ఇక, ఐస్ క్రీమ్స్ మిక్స్ పై ఎక్కడా మూతలు లేవు. ఇలాంటి వాతావరణంలో ఐస్ క్రీమ్స్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కేటుగాళ్లు.

ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. ఇతర శాఖల పర్మిషన్ కూడా లేదు. పైగా, బోరు నీటితోనే తయారు చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మచ్చుక కూడా కనిపించవు. ఈ ఐస్ క్రీమ్స్ తింటే స్వీట్ పాయిజన్ తీసుకున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పాలిట శాపంగా మారుతుంది.

మీ పిల్లలు అడిగిన వెంటనే ఐస్ క్రీమ్ కొనివ్వాలంటే జాగ్రత్త పడక తప్పదు. వివిధ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్న ఐస్ క్రీమ్స్ తయారీలో కేటుగాళ్లు కల్తీకి పాల్పడుతున్నారు. ధనార్జనే ధేయ్యంగా కొందరు అక్రమార్కులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అమన్ గల్ లో నాసిరకం ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.10లక్షల విలువ చేసే ఐస్ క్రీమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముడి పదార్దాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేశారు. టేస్ట్ పెరగడానికి ఐస్ క్రీమ్ తయారీలో హానికరమైన పౌడర్ ని ఉపయోగిస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో తేలింది. ఇలా తయారు చేసిన నాసిరకం ఐస్ క్రీమ్ లకు బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీల లేబుల్స్ వేసి మార్కెట్ లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు ఫంక్షన్లు, పార్టీలు, శుభకార్యాలకు కూడా ఈ నాసిరకం ఐస్ క్రీమ్ లనే సరఫరా చేసి రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు కంత్రీగాళ్లు.

Also Read..Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

ఆ మధ్య వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి దందానే బయటపడింది. టాస్క్ ఫోర్స్ అధికారులు పరిగి, తాండూర్, వికారాబాద్ లోని ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలపై మెరుపు దాడులు చేసి విషపూరిత రసాయనాలు వాడుతున్నట్లు కనుగొన్నారు. ఐస్ క్రీమ్స్ తయారీలో కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆకర్షణీయంగా ఉండి మిలమిల మెరిసేందుకు మెటల్ అదే విధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ మెటీరియల్ వాడుతున్నట్లుగా గుర్తించారు. ఈ రెండూ.. రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలో తేలింది. హైదరాబాద్ లోనూ కల్తీ ఐస్ క్రీమ్స్ దందా వెలుగుచూసింది.