ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. వీటి రేట్లు తగ్గనున్నాయ్.. ఆ రంగాల్లోని కంపెనీలకు లాభాలే లాభాలు

ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో భాగంగా గురువారం భారత్ - యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు.

PM Modi UK PM Keir Starmer

India-UK Free Trade Agreement: ప్రధాని నరేంద్ర మోదీ యూకేలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం భారత్ – యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల్లో పలు రంగాలు లాభపడబోతున్నాయి.

2014లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ యూకేలో పర్యటించడం ప్రస్తుతం నాల్గోసారి అవుతుంది. వాణిజ్యం, ఇంధనం, భద్రత, ఆరోగ్యం, విద్య అంశాలపై చర్చించడానికి, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరపడానికి ప్రధాని మోదీ.. యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌ను కలవనున్నారు.

2023-24 మధ్య కాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే.. దాదాపు 36బిలియన్ డాలర్లు సంచిత పెట్టుబడులతో యూకే భారతదేశంలో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. యూకేలో ప్రస్తుతం వెయ్యికిపైగా భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

వీటి రేట్లు తగ్గుతాయ్..
వాణిజ్య ఒప్పందం ప్రకారం.. స్కాచ్ విస్కీ, జిన్‌పై సుంకాలు తక్షణమే 150శాతం నుంచి 75శాతంకు తగ్గుతాయి. వచ్చే దశాబ్ద కాలంలో 40శాతానికి తగ్గుతాయి. అదేవిధంగా యూకే తయారీ కార్లకు భారతదేశంలో ప్రస్తుతం వంద శాతం సుంకాలు విధిస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత ఆ సుంకాలను క్రమంగా 10శాతానికి తగ్గుతాయి. సౌందర్య సాధనాలు, సాల్మన్, చాకెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలతో సహా అనేక యూకే ఉత్పత్తులపై భారత్ పన్నులను తగ్గించబోతుంది.

భారత్‌లోని ఈ రంగాలకు లాభాలు..
ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారత్ అనేక వస్తువుల ఎగమతులపై రాయితీలను పొందనుంది. భారతదేశం నుంచి యూకేకు ఎగుమతి అయ్యే దాదాపు 99శాతం వస్తువులపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నీచర్, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలపై యూకే ప్రభుత్వం ప్రస్తుతం 16 శాతం వరకు పన్ను విధిస్తోంది. ఇకపై ఈ ఉత్పత్తులకు యూకేలో పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా భారతీయ వస్త్ర, ఫుట్ వేర్, ఆటో మొబైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థలు భారీగా లాభపడనున్నాయి.

భారత ఎగుమతిదారులకు యూకే ఒక ముఖ్యమైన మార్కెట్ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది. వస్త్రాలు, పాదరక్షలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి భారతీయ రంగాలకు మేలు కలిగిస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటిష్ పార్లమెంట్, భారత కేంద్ర మంత్రివర్గం నుంచి చట్టపరమైన అనుమతులు పొందిన తర్వాత, ఒక సంవత్సరంలోపు అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.