Vice Presidential Election 2025: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. ఎవరీ సుదర్శన్ రెడ్డి?

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential Election 2025) అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది.

Vice Presidential Election 2025 Former Supreme Court judge B. Sudershan Reddy

Vice Presidential Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఉదయం కూటమి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పీసీ రాధాకృష్ణన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. (Vice Presidential Election 2025)

ఇండియా కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరు ప్రకటన సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బి. సుదర్శన్ రెడ్డి భారతదేశంలో అత్యంత విశిష్టమైన, ప్రగతిశీల న్యాయ నిపుణుల్లో ఒకరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారని చెప్పారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన సుదర్శన్ రెడ్డి.. పేదల పక్షపాతిగా, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఎంతో కృషి చేశారని అన్నారు.

ఎవరీ సుదర్శన్ రెడ్డి..?
♦ జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1946 జులై 8న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అకుల మైలారం గ్రామంలో జన్మించారు.
♦ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు.
♦ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి.. 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా నమోదు అయ్యారు.
♦ కె. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వృత్తి ప్రారంభించి.. రాజ్యాంగ, సివిల్, రెవెన్యూ చట్టాలపై నైపుణ్యం సాధించారు.
♦ 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, 2005లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు.
♦ 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో పదవీ విరమణ చేశారు.
♦ తన పదవీ విరమణ తరువాత గోవా లోకాయుక్తగా, అలాగే కర్ణాటక మైనింగ్ పర్యావరణ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.
♦ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన పదవీ కాలంలో రాజ్యాంగం, మానవహక్కులు, బ్లాక్ మనీ కేసులపై కీలక తీర్పులు ఇచ్చారు.