చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లనూ అధిగమించేందుకు సర్వసన్నద్ధులై ఉండాలని సూచించారు.
ప్రస్తుతం భారత్… ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సవాళ్లు ఎదుర్కొంటోందని, వాటిని దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని రావత్ అన్నారు. చైనా దుకుడు చర్యలను భారత్ చూస్తూనే ఉందని.. వాటిని తిప్పికొట్టే శక్తిసామర్థ్యాలు దేశ త్రివిధ దళాలకు ఉన్నాయని రావత్ అన్నారు.
సరిహద్దుల్లో శాంతి మరియు ప్రశాంతతను భారతదేశం కోరుకుంటుందని అన్నారు. పాంగాంగ్ సో సరస్సు వెంట చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా భారత చర్యలను రావత్ సమర్ధించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చైనా ఆర్థిక సహాయం చేస్తోందని, పాకిస్థాన్ కు చైనా సైనిక, దౌత్య పరంగా మద్దతిస్తోందని రావత్ తెలిపారు.
ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో అలజడులు సృష్టించడానికి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి.. పాకిస్థాన్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకి ప్రయత్నిస్తే ఆ దేశం భారీ నష్టాలను చవిచూడవచ్చని, ఎందుకంటే దీనిని ఎదుర్కోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు రావత్ తెలిపారు.