india coronavirus : కేసులు 13 వేల 835..452 మంది మృతి

  • Publish Date - April 18, 2020 / 02:28 AM IST

భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్‌ కోవిడ్‌ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 1076 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరోసారి ఒకే రోజు వెయ్యికి మించి కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌లో ఇప్పటి వరకు వెయ్యి కేసులు దాటాయి. గుజరాత్‌లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1021కు చేరింది. 38 మంది చనిపోయారు.

ఇక దేశంలో కరోనా మహమ్మారి 452 మందిని ఇప్పటి వరకు బలితీసుకుంది. గురువారం 28 మంది చనిపోగా.. శుక్రవారం ఏకంగా 32మంది ప్రాణాలు విడిచారు. ఇక కరోనా బారినపడి 1766 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 11 వేల 616కు చేరింది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులే పట్టింది. లాక్‌డౌన్‌ కాలంలో గత ఏడు రోజులు కేసుల వివరాలను పరిశీలిస్తే… కేసుల రెట్టింపుకు 6.2 రోజులు పడుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు.. కేరళ, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, హరియాణా, ఢిల్లీ, బీహార్‌, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా కారణంగా కోలుకుంటున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి నిష్పత్తి 80: 20గా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. కొన్ని దేశాలతో పోల్చినప్పుడు భారత్‌ మెరుగైన స్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దేశ వ్యాప్తంగా కరోనా కోసం కేటాయించిన 1919 ఆస్పత్రుల్లో… లక్షా 73వేల ఐసోలేషన్‌ బెడ్లు, 21వేల 800 ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు  3 లక్షల 19వేల 400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని… గురువారం ఒక్కరోజే  28వేల, 340 టెస్ట్‌లు చేసినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ ముందున్న పరిస్థితులతో పోల్చినప్పుడు కరోనా కొత్త కేసుల నమోదు ఇప్పుడు 40శాతం తగ్గినట్టుగా కేంద్రం తెలిపింది. మార్చి 15 నుంచి 30 వరకు   పోల్చితే… 2.1 శాతం కేసులు నమోదయ్యాయన్నారు.  ఏప్రిల్‌ 1 నుంచి శుక్రవారం రాత్రి వరకు  1.2శాతం కేసులే నమోదయ్యాయని తెలిపారు. 

Also Read | దేశంలో ఫస్ట్ టైమ్..ఏపీకి Rapid Kits : 10 నిమిషాల్లో రిపోర్టు..ఇవి ఎలా పని చేస్తాయో తెలుసా