×
Ad

Agni Prime Missile : అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచే శత్రువులపై గురి.. ఇక పాక్, చైనా ఆటలు సాగవ్.. 2వేల కి.మీ పరిధిలోని లక్ష్యాలు ధ్వంసం..

అగ్నిఫ్రైమ్ క్షిపణి (Agni Prime Missile) లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.

Agni Prime Missile

Agni Prime Missile : భారతదేశం క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రధాన పురోగతిని సాధించింది. బుధవారం అర్ధరాత్రి తరువాత ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజర్‌లో అగ్నిఫ్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైంది.

Also Read: Gold Rate Today : పండుగ వేళ గోల్డ్ ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. వరుసగా రెండోరోజు పడిపోయిన రేటు..

ఈ క్షిపణి 2వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది. దీంతో భారత సైన్యం విస్తారమైన రైలు నెట్‌వర్క్‌ను ఉపయోగించి దేశంలోని ఏ మూల నుంచి అయినా ఈ క్షిపణిని రవాణా చేయడంతోపాటు.. ప్రయోగించొచ్చు. ఇది క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

అగ్ని ‌ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అణుసామర్థ్యం ఉన్న అగ్ని‌ఫ్రైమ్ క్షిపణిని తొలిసారి రైలు పైనుంచి ప్రయోగించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థను ఆయన అభినందించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంఛింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రైలు నెట్‌వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్ టైమ్‌లో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చునని తెలిపారు. ఈ కొత్త తరం క్షిపణి దాదాపు 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనుసైతం చేధించగలదని చెప్పారు.

అగ్ని‌ప్రైమ్ క్షిపణి అంటే ఏమిటి?
♦ అగ్నిఫ్రైమ్ క్షిపణిలో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
♦ అగ్నిఫ్రైమ్ క్షిపణిలోని రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షల్ నేవిగేషన్, మైక్రో ఇనర్షల్ నావిగేషన్ సిస్టమ్‌లను అమర్చారు.
♦ జీపీఎస్, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లకు కూడా దీన్ని వాడుకొనే ఆప్షన్ ఉంది.
♦ అధునాతన నావిగేషన్ వ్యవస్థ శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతిస్తుంది.
♦ ఈ క్షిపణిలో ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపర్చవచ్చు.
♦ లాంఛింగ్‌కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
♦ ఈ క్షిపణి వర్షం, దుమ్ము, వేడి నుంచి రక్షించే డబ్బాలో నిల్వ చేయబడుతుంది.
♦ పొగమంచులో, రాత్రిపూట కూడా ఇది లక్ష్యాలను గురిపెట్టి దూసుకెళ్తుంది.
♦ అగ్ని ఫ్రైమ్ క్షిపణి అందుబాటులోకి రావడం వల్ల సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించడంలో వేగంగా పనిచేస్తుంది.
♦ త్వరలోనే ఈ అగ్ని-ప్రైమ్ క్షిపణిని సైన్యంలోకి చేర్చనున్నారు.

2010లో అగ్నిఫ్రైమ్ క్షిపణి అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది అగ్ని-5 కంటే తేలికైంది.. ప్రమాదకరమైంది. డీఆర్డీవో చీఫ్ డాక్టర్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ.. అగ్నిఫ్రైమ్ విజయవంతం కావడం స్వదేశీ సాంకేతికత బలాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరింత అధునాతన వ్యవస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.