Indus Water Treaty
Indus Water Treaty: జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతోపాటు వారిని ఎగదోస్తున్న శక్తులనూ బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్ కు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం సాయంత్రం దిల్లీలోని లోక్‌నాయక్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్ తో సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. భారత్ ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల పాకిస్థాన్ పై ఏమేరకు ప్రభావం పడుతుందన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి..?
భారతదేశం, పాకిస్థాన్ మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు జల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) జరిగింది. ఇది సరిహద్దు జలాల పంపకానికి ఒక ముఖ్యమైన ఒప్పందంగా పరిగణించబడుతుంది. తొమ్మిది సంవత్సరాల చర్చల తరువాత ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంపై సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి భారతదేశం తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లు సంతకాలు చేశారు.
Also Read: Gautam Gambhir: ‘నిన్ను చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు
సింధు జలాల ఒప్పందం ఎలా పనిచేస్తుంది..?
ఈ ఒప్పందం ప్రకారం.. సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లేజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎంఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు పశ్చిమ ఉపనదులైన సింధు, జీలం, చీనాబ్ ల పై పాకిస్థాన్ హక్కులను కలిగి ఉంటుంది. వీటి సామర్థ్యం 135 ఎంఏఎఫ్ గా ఉంది. పాకిస్థాన్ లో వ్యవసాయానికి, ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో వ్యవసాయానికి కీలకమైన ఈ నదుల నుంచి మొత్తం నీటిలో 80శాతం అందుతుండటంతో ఈ ఒప్పందం పాకిస్థాన్ కు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆ ఒప్పందం ఎందుకు అవసరమైంది?
1947లో బ్రిటీష్ ఇండియా విభజించబడినప్పుడు టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది. 1948లో భారతదేశం పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఐక్యరాజ్య సమితి తటస్థ మూడవ పక్షాన్ని చేర్చుకోవాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం వహించింది. సంవత్సరాల చర్చల తరువాత కీలకమైన నదీ వ్యవస్థను శాంతియుతంగా నిర్వహించడానికి, నీటి వాటాను పంచుకోవడానికి 1960లో భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జల ఒప్పదంపై సంతకాలు చేశారు.
ప్రస్తుతం భారత్ నిర్ణయం వల్ల పాక్ పై ఎలాంటి నష్టం ఉంటుంది..?
◊ పాకిస్థాన్ నీటి అవసరాలు, వ్యవసాయ రంగానికి అవసరమైన నీరు సింధు నది, దాని ఉపనదుల నుంచి అందుతున్నాయి. కాబట్టి, సింధు నది ఒప్పందం నిలిపివేస్తే పాకిస్థాన్ పై ప్రభావం పడుతుంది. అది ఎలాఅంటే..?
◊ జీలం, చీనాట్, రావి, బియాస్, సట్లెజ్ నదులతో కూడిన సింధు నది పరివాహం పాకిస్థాన్ ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ నది పది లక్షల జనాభాకు ఉపయోగపడుతుంది.
◊ పాకిస్థాన్ లోని వ్యవసాయానికి, ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో 80శాతం సింధు నది నుంచే వినియోగిస్తున్నారు.
◊ పాకిస్థాన్ నీటిపారుదల (వ్యవసాయం, తాగునీటికోసం) ఈ నది నీటి సరఫరాపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.
◊ పాకిస్థాన్ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం 23శాతం వాటాను కలిగిఉంది. పాకిస్థాన్ గ్రామీణ జనాభాలో 68శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
◊ నీటి ప్రవాహానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే అది పాకిస్థాన్ వ్యవసాయ రంగానికి భారీగా నష్టం చేకూర్చుతుంది.
◊ నీటి లభ్యత తగ్గడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. పంట దిగుబడి తగ్గడం, ఆహారం కొరత, ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది.
◊ పాకిస్థాన్ ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడం వల్ల ఆ దేశంలో భూగర్భ జలాలు క్షీణించడంతోపాటు వ్యవసాయ భూముల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతుంది.
◊ పాకిస్థాన్ లో నీటి సామర్థ్యం తక్కువగా ఉంది. మంగళా, టార్బెలా వంటి ప్రధాన ఆనకట్టలు కలిపి 14.4 మిలియన్ ఎకరాల అడుగులు (ఎంఏఎఫ్) మాత్రమే ప్రత్యక్ష నిల్వను కలిగి ఉన్నాయి. ఇది పాకిస్థాన్ వార్షిక నీటి వాటాలో కేవలం 10శాతం మాత్రమే.