Pahalgam Terror Attack: ‘మేము పొదల్లోకి పరిగెత్తాం..కానీ, చంద్రమౌళిని కోల్పోయాం’.. పహల్గాం ఉగ్రదాడి భయానక క్షణాలను వివరించిన ఏపీ పర్యటకులు
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.

Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్ పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు దాడికిముందు మతంపేరు తెలుసుకొని తుపాకీలతో కాల్చి చంపేశారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులను వారి కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపేశారు. ఈ క్రమంలో 28మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు. కానీ, వారు తమ ప్రయాణ సహచరుడు జేఎస్ చంద్రమౌళిని పొగొట్టుకున్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి ఎస్బీఐలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మూడేళ్లుగా విశాఖ బీచ్ రోడ్డులోని పాండురంగాపురం జీఈవీ ఎంకరేజ్ అపార్ట్ మెంట్ లో భార్యతో కలిసి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహంకాగా.. వారు అమెరికాలో స్థిరపడ్డారు. చంద్రమౌళి ఆయన భార్య నాగమణి, మరో ఇద్దరు మిత్రుల కుటుంబాలు అప్పన్న, శశికుమారి, రెడ్డి శశిధర్, సుమిత్రదేవీలతో కలిసి ఏప్రిల్ 18న కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈనెల 22న మంగళవారం మధ్యాహ్నం పహల్గాంకు కారులో వెళ్లారు. అక్కడి నుంచి మినీ స్విట్జర్లాండ్ గా పేరుపొందిన బైసరన్ కు గుర్రాలపై వెళ్లారు.
బైసరన్ కు వెళ్లిన తరువాత చంద్రమౌళి వాష్ రూమ్ కు వెళ్లారు. బయటకు వచ్చే సరికి ఉగ్రవాదులు సుమారు 15మీటర్ల దూరం నుంచి పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. చంద్రమౌళి పక్కనే ఉన్న రక్షణ కంచెదాటుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముష్కరులు వెంటపడి.. చంపొద్దని వేడుకున్నా వదల్లేదు. కాల్పులు జరిపి హతమార్చారు. అయితే, అప్పటికే చంద్రమౌళి మా గుంపునుంచి విడిపోయాడు. మేము పక్కనే గుబురైన పొదలచాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని ఏపీ పర్యటకులు తెలిపారు.
చంద్రమౌళి వాష్ రూంకు వెళ్లడంతో ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకొని సురక్షితంగా ఉన్నాడని మేము భావించా. లేదంటే.. వాష్ రూంలో ఉండి ఉంటాడని అనుకున్నాం. అతను హోటల్ కు తిరిగి వస్తాడని మేమంతా ఆశతో ఎదురు చూశాం. కానీ, అర్ధరాత్రి 1.30గంటల సమయంలో స్థానిక ఆస్పత్రికి అనేక మృతదేహాలను తీసుకొచ్చినట్లు స్థానిక అధికారులు చంద్రమౌళి భార్య నాగమణికి సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లి చూడగా.. రాజమౌళి చనిపోయి ఉన్నాడు. ఆయన మృతదేహాన్ని చూసి నాగమణి అక్కడే కుప్పకూలిపోయింది. చంద్రమౌళి భార్య నాగమణి తన బంధువులతో దాడికి సంబంధించిన విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యాంతమైంది. ఎలాంటి కారణం లేకుండా ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారని పేర్కొంది.
కాల్పులు జరిపే సమయంలో పొదలమాటున దాక్కొని.. కంచె కింద ఉన్న గ్యాప్ నుంచి తప్పించుకొని వచ్చాం. చంద్రమౌళి కూడా ఎక్కడో దాక్కొని ఉంటాడని భావించా. కానీ, మేము అతని మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద కొనుగొన్నామని బంధువులకు వివరిస్తూ చంద్రమౌళి భార్య నాగమణి కన్నీటి పర్యాంతమైంది.