Prime Minister Narendra Modi, European Commission President Ursula von der Leyen and European Council President Antonio Costa (PIC: Twitter)
India-EU FTA: భారత్-(యూరోపియన్ యూనియన్)ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ పర్యటనలో ఉన్న యురోపియన్ నేతల సమక్షంలో జరిగిన 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కలిసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను యూరోపియన్ యూనియన్ వాణిజ్య కమిషనర్ మారోష్ షెఫ్కోవిచ్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు.
ఈ ఒప్పందాన్ని భారత్-యూరోపియన్ యూనియన్ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంలో చారిత్రక మైలురాయిగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఏమిటీ ఒప్పందం?
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే దేశాల మధ్య సుంకాలు తగ్గించి వాణిజ్యాన్ని ప్రోత్సహించే అగ్రిమెంట్. 2022 నుంచి మళ్లీ ప్రారంభమైన చర్చోపచర్చల ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైంది. సమతుల్యమైన ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని సాధించాలనే సంకల్పం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది.
భారత్‌కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా పెరుగుతోంది. 2024-25లో వస్తువుల ద్వైపాక్షిక వాణిజ్యం రూ.11.5 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.6.4 లక్షల కోట్లు, దిగుమతులు రూ.5.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024లో సేవల వాణిజ్యం రూ.7.2 లక్షల కోట్లకు చేరింది.
భారత్, యూరోపియన్ యూనియన్ గ్లోబల్ జీడీపీలో 25 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటా వీటిదే. ఈ ఒప్పందం భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తుంది.
“భారత్-యురోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక విజయంగా నిలుస్తుంది. విశ్వసనీయమైన, పరస్పర లాభదాయకమైన, సమతుల్య భాగస్వామ్యాల వైపు భారత్ అడుగులు వేస్తున్న దిశకు ఇది మరింత బలాన్ని ఇస్తుంది” అని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఎన్నెన్ని లాభాలో..
సాధారణ వాణిజ్య ఒప్పందాన్ని మించి ఈ ఒప్పందం వ్యూహాత్మక అంశాలతో కూడిన సమగ్ర భాగస్వామ్యాన్ని సూచిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన ఒప్పందాల్లో ఇది ఒకటి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి బలాన్నిస్తుంది. వస్తువులతో పాటు సేవల రంగంలోనూ ఎంతో పురోగతి సాధించవచ్చు.
నైపుణ్యం కలిగిన భారతీయులు సులభంగా భారత్-ఈయూ మధ్య రాకపోకలు సాగించవచ్చు. వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ ఒప్పందం ద్వారా ఉపాధి సృష్టి, ఆవిష్కరణలు, విభిన్న రంగాల్లో అవకాశాల విస్తరణ, గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం పెంపొందించుకునే స్థితిలో నిలుస్తుంది.
ఈ ఒప్పందం వస్తువులు, సేవల వాణిజ్యం, వాణిజ్య పరిహారాలు, కస్టమ్స్, వాణిజ్య సౌలభ్యాలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు, డిజిటల్ వాణిజ్యం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలను కూడా కవర్ చేస్తుంది.
వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్ రంగాలకు ఈ ఒప్పందం బలమైన ఊతమిస్తుంది. దాదాపు 33 బిలియన్ డాలర్ల ఎగుమతులపై పది శాతం వరకు ఉన్న సుంకాలు ఒప్పంద అమలుతోనే జీరోకి తగ్గుతాయి. ఇది కార్మికులు, కళాకారులు, మహిళలు, యువత, సూక్ష్మ మధ్యతరహా సంస్థలను శక్తిమంతం చేస్తుంది.
ఆటోమొబైల్ రంగంలో కోటా ఆధారిత సున్నితమైన స్వేచ్ఛా విధానం అమలవుతుంది. ఇది యూరోపియన్ వాహన తయారీదారులకు అధిక ధర శ్రేణుల్లో మోడళ్ల ప్రవేశానికి అవకాశం ఇస్తుంది. భవిష్యత్‌లో భారత్‌లో తయారీ, ఎగుమతులకూ దారితీస్తుంది. భారత వినియోగదారులకు అధునాతన సాంకేతిక ఉత్పత్తులు లభిస్తాయి.
వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార రంగాలకు ఈ ఒప్పందం పెద్ద ఊతమిస్తుంది. టీ, కాఫీ, మసాలాలు, తాజా పండ్లు, కూరగాయలు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులకు పోటీతత్వం పెరుగుతుంది. గ్రామీణ జీవనోపాధులు బలపడతాయి.