Medicines Prices Reduced
Medicines Prices Reduced: పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం ఊరట కల్పించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 37రకాల ముఖ్యమైన ఔషధాల ధరలను 10 నుంచి 15శాతం తగ్గించింది. వీటిలో గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, విటమిన్ లోపాలతోపాటు మరికొన్ని వ్యాధులకు సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. ఈ మేరకు శనివారం సంబంధిత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్‌పీపీఏ తగ్గించిన ఔషధాల్లో.. పారాసిటమాల్, అటోర్వాస్టాటిన్, అమోక్సిసిలిన్, మెట్‌ఫార్మిన్ వంటి ఔషధాలు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ విక్రయించే ఎసిలోఫెనాక్, పారాసిమాల్, ట్రెప్సిన్ కైమో ట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధర రూ.13గా నిర్ణయించారు. ఇదే కాంబినేషన్‌తో క్యాడిలా ఫార్మాసూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధరను రూ.15.01గా ఉంటుంది. అదేవిధంగా.. గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఉపయోగించే ఆటోర్వాస్టాటిన్ 40ఎంజీ మరియు క్లోపిడోగ్రెల్ 75ఎంజీ మాత్రల ధరను రూ.25.61గా నిర్ణయించారు.
విటమిన్ డీ లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల ముందు, చిన్నారులకు వాడే సెఫిక్సిమ్ ఓరల్ సస్పెన్షన్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక ఎంఎల్ రూ.31.77) వంటివి కూడా ధరలు తగ్గించిన వాటిలో ఉన్నాయి. టైప్2 డయాబెటీస్ నియంత్రణలో కీలకమైన ఎంపాగ్లిప్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్స్ ఒక్కో టాబ్లెట్ ధరను రూ.16.50కి పరిమితం చేశారు.
అంతకుముందు ప్రభుత్వం మే 2024లో ఎనిమిది ఔషధాల ధరను పెంచాలని నిర్ణయించింది. ఈ మందులను ఉబ్బసం, టీబీ, గ్లాకోమాతోపాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎనిమిది ఔషదాలకు సంబంధించి 50శాతం వరకు పెంచడానికి ఆమోదం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల వ్యాధులకు ఉపయోగించే ఔషధాల ధరలు పెరిగాయి. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే, తాజాగా. 37రకాలకు సంబంధించిన ఔషధాల ధరలను తగ్గిస్తూ వాటి వినియోగదారులకు ఎన్‌పీపీఏ గుడ్ న్యూస్ చెప్పింది.