అత్యంత అధునాతన ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ఈ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఆమ్కా) ప్రాజెక్టు మన దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. శత్రువుల రాడార్లను సైతం ఏమార్చుతూ, దేనికీ చిక్కకుండా వారి గగనతలంలోకి ఇది దూసుకెళ్తుంది. మన దేశ వైమానిక పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది.
రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పలు సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించిన బిడ్లను స్వతంత్రంగా, సంయుక్తంగా, కన్సార్షియం ద్వారా దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆమ్కా మోడల్‌ను ఇప్పటికే బెంగళూరులో ఏరో ఇండియాలో మొదటిసారి ప్రదర్శించారు. ఆమ్కాలో ఏఐ బేస్డ్ ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ బేస్డ్ ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఇది 25 టన్నుల బరువు ఉండనుంది.
ఏవియానిక్స్, సెన్సర్ ఫ్యూజన్, ఏఐతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్, ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీకి సేవలు అందించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. గగనతలం, భూతలంపై దాడులు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి వాటిని అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని పైలట్ నడపవచ్చు. పైలట్ లేకుండానూ నడపవచ్చు.
హైదరాబాద్ వెమ్ టెక్నాలజీస్ కంపెనీ దీని ఆకృతిని తయారు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.15,000 కోట్ల ప్రారంభ వ్యయంతో మొదలుపెడతారు. 2035లోపు తయారు చేయాలని డీఆర్‌డీవో భావిస్తోంది. అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులను, మందుగుండును అమర్చవచ్చు.
దీని ద్వారా గైడెడ్ మిస్సైళ్లు, నాలుగు దీర్ఘశ్రేణి మిసైళ్లను ప్రయోగించవచ్చు. 1,500 కేజీల బరువైన బాంబులను కూడా ఇది సులభంగా జారవిడుస్తుంది. ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికాకు ఎఫ్ 22 రాప్టర్, ఎఫ్ 35ఏ లైట్నింగ్ ఐఐ ఉండగా, చైనా వద్ద చెంగ్డూ జె 20 మైటీ డ్రాగన్, జె 35, రష్యా వద్ద సుఖోయ్ 57ఈ ఉంది.