Site icon 10TV Telugu

ఇండియా జాక్‌పాట్‌? బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్‌ఐ

మధ్యప్రదేశ్‌ జబల్పూర్‌ జిల్లాలోని సిహోర తాలూకా, బేలా, బినైకా గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నిపుణులు ఆ ప్రాంతంలో తవ్వకాలు చేసి మట్టినమూనాలను పరీక్షిస్తున్నారు. ఇప్పుడు అక్కడ చిన్న బంగారు కణాలు, లోహాలు దొరికినట్లు ధ్రువీకరించారు.

ప్రాథమిక సర్వే ప్రకారం బంగారు నిక్షేపాలు సుమారు 100 హెక్టార్లలో వ్యాపించి ఉండగా, దాని పరిమాణం లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇది పూర్తిగా నిర్ధారితమైతే జబల్పూర్‌ దేశంలోనే ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుంది.

దీనిపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డైరెక్టర్‌ జనరల్‌ ఆసిత్‌ సహా మాట్లాడుతూ.. బంగారంతో సంబంధం ఉన్న కణాలు దొరికినప్పటికీ, అతి పెద్ద బంగారు గని లేదా విస్తారమైన నిక్షేపం ఉందని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అక్కడ ఎంత బంగారం ఉందో తెలుసుకోవడానికి, తవ్వడం లాభదాయకమేనా అన్న విషయంపై ఓ అవగాహనకు రావడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు.

మట్టినమూనాలలో బంగారం ఆనవాళ్లు ఉన్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయి పరిశోధన అవసరమని తెలిపారు. జీఎస్‌ఐ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 40 కంటే ఎక్కువ ప్రాజెక్టులపై పని చేస్తోందని, జబల్పూర్‌ ప్రాంతం వాటిలో ముఖ్యమైనదని తెలిపారు. ఈ ప్రాంతం భౌగోళికంగా సంపన్నమైందని, గతంలోనూ విలువైన ఖనిజాలు దొరికాయని గుర్తు చేశారు.

గ్రామ సర్పంచ్‌ రామ్‌రాజ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. తమ భూమిలో బంగారు కణాలు దొరికాయని తెలిసిన వెంటనే గ్రామస్థులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారని చెప్పారు. తవ్వకాలు చేసిన ప్రదేశాన్ని చాలామంది చూడటానికి వెళ్లారని తెలిపారు. “ఇక్కడ బంగారు తవ్వకాలు మొదలైతే ఉద్యోగాలు, మంచి రహదారులు, విద్యుత్‌, మరిన్ని సౌకర్యాలు వస్తాయని ఇప్పుడు గ్రామస్థుల్లో ఆశలు మొదలయ్యాయి” అని అన్నారు.

పెద్ద పరిమాణంలో బంగారం ఉన్నప్పుడే తవ్వకాలు
బంగారం కోసం తవ్వకాలకు ఖర్చు బాగా అవుతుందని, ఆ ఖర్చును మించే పరిమాణంలో బంగారం ఉన్నప్పుడే తవ్వకాలు ప్రారంభిస్తారని ఆసిత్‌ సహా తెలిపారు. అధికారులు ప్రస్తుతం జబల్పూర్‌ ప్రాంతంలోని ఖనిజ సంపదపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Exit mobile version