Covid Cases In India
Covid-19 Cases: దేశంలో కరోనా వైరస్ (corona virus) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కొవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఒక్కరోజు) దేశంలో 10,158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా 7,830 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే రోజువారి కొత్తకేసులసంఖ్య 10వేలు దాటింది. అంటే 24గంటల్లోనే 30శాతం ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదు కాగా.. వారం వారీగా పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.10శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 రికవరీ రేటు 98.71శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19శాతం నమోదైంది. ఇదిలాఉంటే ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటుంది. దేశంలో కరోనా ఎండమిక్ దశలో ఉందని, తదుపరి 10-12 రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆ తరువాత తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బుధవారం ఒక్కరోజులో ఢిల్లీలో 4,827 మంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,149 మందికి కొవిడ్ పాజిటివ్ గా నమోదైంది. మరోవైపు కొవిడ్-19తో చికిత్స పొందుతూ ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,421గా ఉంది.