చైనా యాప్స్ నిషేదమే కాదు.. ఇండియా టార్గెట్ వేరే ఉందట

చైనా ఉత్పత్తులపై ఆధార పడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందులోభాగంగా డ్రాగన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల వివరాలను ఇప్పటికే కేంద్రం సేకరించింది. ఇక దేశంలో చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదన్న డిమాండ్ ఎక్కువైంది. ప్రజల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రంగాల్లో ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదు.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులపై ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.
అదే సమయంలో డిజిటల్ వార్ స్పీడప్ చేసింది. యాప్స్‌ని వరుసపెట్టి నిషేదిస్తోంది. ఓ వైపు ప్రపంచమంతా చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో విలవిలలాడుతుంటే.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బోర్డర్‌లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు భారత సర్వర్లపై సైబర్ ఎటాక్‌లతో చైనీస్ హాకర్లు విరుచుకుపడుతున్నారు. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై చైనీస్ హ్యాకర్లు దాదాపు 50 వేలకు పైగా ప్రయత్నాలు చేశారు. కరోనాను అడ్డం పెట్టుకుని అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు కుట్రలు పన్నారు.
యాప్‌ల మాటున వేర్వేరు పేర్లు, సంస్థలతో వేల సంఖ్యలో మెయిల్స్ పంపుతున్నారు. ఉచితంగా కోవిడ్ పరీక్షలు చేస్తామని, రాయితీలు ఇస్తామని మెసేజ్‌లు చేస్తున్నారు. ఇలా పూర్తిగా మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ నిఘావర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి మరియు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం క్రమంగా అనేక చర్యలు తీసుకుంటోంది.
భారత్‌లో నిషేధించిన చైనీస్ యాప్‌లు అలాగే చైనా దిగుమతులను అరికట్టే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా లాంటి ఇతర ఈ-కామర్స్ సంస్థలు వస్తువులకు లేబుల్‌లను జోడించడం మొదలుపెట్టాయి. కొన్ని చైనా యాప్స్ నిషేధించడంతో చాలామంది ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం పలు సంస్థలు, కంపెనీలు సరికొత్త యాప్‌లను యూజర్లకు పరిచయం చేస్తున్నాయి. టిక్ టాక్ ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ దానికి మించిన యాప్‌గా నిలుస్తోంది చింగారి. రోపోసో, మిట్రాన్ కూడా టిక్ టాక్‌ను మించిపోతున్నాయి.
షేరిట్‌కి బదులు ఫైల్స్ బై గూగుల్ ఉపయోగిస్తున్నారు. ఎంఐ వీడియాకాల్‌కి బదులుగా గూగుల్ డుయో, వాట్సప్‌ల వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు పబ్‌జీ, లూడో వరల్డ్ బ్యాన్ చేసినా వాటి ప్లేస్‌లో అద్భుతమైన యాప్‌లు వస్తాయంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. నిజానికి చైనాకు అమెరికా తర్వాత అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఇండియానే. దిగుమతుల్లో చైనా వాటా 14 శాతం వరకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం, కంప్యూటర్ విభాగాలు, ప్లాస్టిక్ బొమ్మలు.. భారత్‌కు చైనా నుంచి ఎక్కువ దిగుమతి అవుతున్నాయి.
దేశీయ మొబైల్ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి నిర్దిష్ట స్థాయిలో చేతి, గోడ గడియారాలు, గ్లాస్ రాడ్లు, గొట్టాలు, హెయిర్ క్రీములు, షాంపూలు, ఫేస్ పౌడర్లు, మేకప్ సామగ్రి, ప్రింటింగ్ సిరా, పెయింట్స్, పొగాకు వస్తువులు దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు కేంద్రానికి తెలిపాయి. చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్ చేస్తే.. అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశం ఉంది.
ఒక పక్క దేశీయ తయారీ రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ.. యువతకు నైపుణ్య శిక్షణ అంధించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీంతో తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధి లభించడంతోపాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుందని భావిస్తోంది.
దేశంలో డిజిటల్ ఎకానమీ, ఆన్‌లైన్ ట్రేడింగ్, ఈ కామర్స్ రంగాల్లో కూడా పెట్టుబడులకు జపాన్, యూరప్ సంస్థలు ఆరాతీస్తున్నాయి. అంతేకాదు భారతీయ జీవన విధానాన్ని కూడా ఇప్పుడు విదేశాలు ఫాలో అవుతున్నాయి. ఇక్కడి వేల ఏళ్లనాటి అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలే కరోనా కేసులు తక్కువ నమోదు అవడానికి కారణమని నమ్మేవారే ఎక్కువ. అందుకే రానున్న కాలంలో కరోనాకి ముందు కరోనా తర్వాతలా చూస్తారో లేదో తెలీకపోయినా… ప్రపంచదేశాలు ఇదివరకటిలా భారత్‌ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు.
చైనా యాప్‌లను భారత్‌లో నిషేధించటంతో వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని డ్రాగన్ కోల్పోతుంది. అక్కడి ఆర్ధికవ్యవస్ధపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే భారత్ నిర్ణయాలపై డ్రాగన్ పాలకులు తీవ్ర ఆందోళన మొదలైంది. మొదట్లో తమ యాప్ లను నిషేధించటం అంత సులభం కాదనుకుంది చైనా. ఊహించని విధంగా భారత్ నిర్ణయం తీసుకోవడంతో మున్ముందు ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందోనని డ్రాగన్ తలలు పట్టుకుంటుందట.
చైనా రాయబార కార్యాలయం ప్రతినిధులు స్పందిస్తున్న తీరు చూస్తుంటేనే చైనా వెన్నులో వణుకు పుడుతుందని స్పష్టమవుతోంది. కేవలం యాప్స్ నిషేదమే కాదు చైనాతో సంబంధాలు, ఒప్పందాలపై కూడా కేంద్రం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దశలవారీగా డ్రాగన్‌కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. యుద్ధానికి సిద్ధమని సంకేతాలిస్తూనే.. అవసరమైతే చైనాతో అన్నిరకాలుగా సంబంధాలు తెంచుకునేందుకు ఏమాత్రం వెనకాడబోమని చాటి చెబుతోంది భారత్.