India Pakistan War
Operation Sindoor: పాకిస్థాన్ బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్ పై విరుకుపడేందుకు విఫలయత్నం చేసిన చావుదెబ్బ తిన్న పాకిస్థాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ మొదలు రాజస్థాన్ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసింది. శ్రీనగర్ లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. శ్రీనగర్ ఎయిర్ బెస్ దగ్గర పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ -16 పైటర్ జెట్ లను కూల్చివేసింది. మరోవైపు భారత్ బలగాలు ఐదు పాకిస్థాన్ మిసైళ్లను పేల్చివేశాయి. యుద్ధ విమానాలు కూల్చే సమయంలో పైలెట్ దూకేసినట్లు, పైలెట్ కోసం భారత ఆర్మీ గాలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు.. పాకిస్థాన్ సైన్యం ఢిల్లీని టార్గెట్ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దాడులకు ప్లాన్ చేసింది. ఫతాహ్ -2 మిస్సైల్ ను ప్రయోగించగా.. ఆ మిసైళ్లను భారత్ ఆర్మీ నేలకూల్చేసింది. పాక్ కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశంలోని మూడు ఎయిర్ బేస్ లను భారత్ ఆర్మీ టార్గెట్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, చక్వాల్ నగరంలోని మురిద్ ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్ లోని ఝాంగ్ జిల్లాలోని రఫికి ఎయిర్ బేస్ లపై దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిసింది. భారత్ సైన్యం ప్రతీకార చర్యలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్.. ఆ దేశంలో అన్ని పట్టణాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ఎయిర్ స్పేస్ లను మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేసింది.
పాక్ లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధ్రువీకరించారు.అయితే, సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్ పై దాడులకు ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’’ అనే పేరు పెట్టింది. అయితే, పాక్ లో దాడులపై భారత వాయుసేన, సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఉదయం 10గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం నిర్వహించనుంది.