హైదరాబాద్ టూ కర్ణాటక: కరోనాతో చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడంటే…!

  • Publish Date - March 13, 2020 / 07:47 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా కారణంగా చనిపోయాడు. అయితే ఇదే దేశంలో తొలి కరోనా మరణం. ఈ విషయాన్ని కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా స్పష్టం చేశారు. అయితే కరోనా సోకిన తర్వాత నుంచి చనిపోయేలోపు సిద్దిఖీ ఎవరెవర్ని కలిశాడు? ఏ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు? అసలు ఎక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు? చనిపోయేలోపు ఏమేం జరిగింది అనే విషయాలను సేకరిస్తున్నారు అధికారులు. 

సిద్దిఖీ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిఫార్సు చేయగా.. అతని కుటుంబ సభ్యులు అతనిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. అతడు వెళ్తుండగానే చనిపోయాడు. అంతకుముందు మార్చి 5వ తేదీన బీదర్‌లోని ఆస్పత్రిలో చేరాడు సిద్ధిఖీ. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆస్పత్రి వర్గాలు అతడి రక్త నమూనాలు సేకరించి పూణెకు పంపించారు.

ఆ నివేదిక వచ్చేలోపే సిద్దిఖీని అతడి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అతడ్ని పరీక్షించి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆస్పత్రి వర్గాలు బీదర్‌ ఆస్పత్రికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా.. మూడ్రోజులు అక్కడ ఉన్నట్లు చెప్పారు. తర్వాత సిద్దిఖీని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం అతనిని కలబుర్గికి తీసుకుని వెళ్లారు. మార్గమధ్యలోనే అతడు చనిపోయాడు.

ఇదిలా ఉంటే బీదర్ ఆస్పత్రిలో చేర్పించాక అతడ్ని ఎందుకు డిశ్చార్జి చేశారు? ఆస్పత్రిని విడిచి వెళ్లడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారా? హైదరాబాద్‌కు ఎలా తీసుకొచ్చారు? అతడి వెంట ఎవరెవరు ఉన్నారు? ఫ్యామిలీలో ఇంకెవరికైనా వైరస్ సోకిందా? అనే విషయాలను అధికారులు ధర్యాప్తు చేస్తున్నారు. కేర్ ఆస్పత్రిలో చేరే కంటే ముందే సిద్దిఖీని సిటీ న్యూరో ఆస్పత్రికి, అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఆస్పత్రి వర్గాలు కేసును టేకప్ చేసేందుకు ఒప్పుకోకపోవడంతో కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

అయితే సిద్ధిఖీ ఇన్ని చోట్ల తిరగడంతో వైరస్ ఎంతమందికి సోకింది అనేది ఇప్పుడు భయం పుట్టిస్తుంది. సిద్దిఖీకి వైద్యం చేసిన డాక్టర్లు, నర్సు స్టాఫ్‌లకి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

See Also | చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్