టిక్కెట్ ధరలు పెంచేందుకు Railway రెడీ..: రూ.35వరకూ

టిక్కెట్ ధరలు పెంచేందుకు Railway రెడీ..: రూ.35వరకూ

Updated On : September 29, 2020 / 10:36 AM IST

Indian Railway:Railway టిక్కెట్ ధరలు పెంచేందుకు మరోసారి రెడీ అయిపోయింది రైల్వే శాఖ. లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.35 వరకు అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు ప్రపోజల్ రెడీ అవడంతో త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపించనున్నారని సమాచారం. ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్‌ తరగతిని బట్టి వినియోగ రుసుమును విధించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వినియోగ రుసుము ఏసీ ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులపై గరిష్ఠంగా రూ.35 వరకు అదనపు భారం పడే అవకాశముండగా, ఇతర తరగతి ప్రయాణికులకు కనిష్ఠంగా రూ.10 ఉండొచ్చని సమాచారం.




దేశవ్యాప్తంగా మొత్తం ఏడు వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా మెరుగుపర్చిన, రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో మాత్రమే వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే స్పష్టం చేసింది. దాదాపు 700-1000 స్టేషన్లలో ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. విమానాశ్రయాల్లో ఇప్పటికే ఇలాంటి వినియోగ రుసుమును వసూలు చేస్తున్నారు. రైల్వేలో మాత్రం ఇప్పటివరకు అమల్లో లేదు.

వినియోగ రుసుము పేరిట వసూలు చేసే సొమ్మును మరిన్ని స్టేషన్ల అభివృద్ధికి ఉపయోగిస్తామని రైల్వే చెబుతోంది. మరో వైపు కొవిడ్-19 రీత్యా ప్రయాణికులు రైల్వేల్లో ప్రయాణించేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో స్టేషన్లు వెలవెలబోతున్నాయి.