India’s 1-Day Covid Cases : భారతదేశాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారి అంతమైనట్టేనా? అంటే ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దాదాపు మూడు నెలల కాలంలో దేశంలో డైలీ కరోనా కేసుల్లో తొలిసారి 50వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్‌లో నమోదైన కరోనా కేసులు కేవలం 46,790 మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొన్నటివరకూ డైలీ కరోనా కేసులు లక్షలపైనే నమోదయ్యేవి.. ఇప్పుడు లక్షల నుంచి 50,000 కంటే తక్కువకు కరోనా కేసులు పడిపోయాయి. దీంతో దేశంలో మొత్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,97,063కి చేరిందని మంగళవారం (అక్టోబర్ 20, 2020) కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో ఒక రోజులో మొత్తంగా 46,790 కరోనా కేసులు నమోదు కాగా.. గత 24 గంటల్లో 587 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,15,197కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా మరణాల సంఖ్య వరుసగా రెండోరోజున 600 కన్నా తక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజున 8 లక్షల కంటే తక్కువకు పడిపోయాయి.
దేశంలో మొత్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 9.85శాతంతో 7,48,538కి చేరిందని డేటా వెల్లడించింది. మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.
ప్రపంచ దేశాల్లో కరోనా మరణాల రేటు 2.7 శాతంగా నమోదైంది. ఇండియాలో గత 24 గంటల్లో కరోనా నుంచి 69,720 మంది కోలుకున్నారు.
దీంతో మొత్తం రికవరీల సంఖ్య 67,33,328కి చేరింది. రికవరీ రేటు పెరగడంతో 88.6 శాతానికి చేరింది. ఇండియాలో సోమవారం ఒక్క రోజే 10,32,795 టెస్టులు చేశారు. అక్టోబర్ 19 వరకు దేశంలో చేసిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 9,61,16,771కి చేరింది.