కరోనా వ్యాక్సిన్లు 110శాతం సురక్షితం…డీసీజీఐ

India’s Wait Over, Drug Regulator Says Covid Vaccines Cleared “110% Safe” ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత దేశం సిద్ధమవుతున్న తరుణంలో వ్యాక్సిన్లపై ప్రచారమవుతున్న వదంతులను డీసీజీఐ (డగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)వీజీ తోసిపుచ్చారు.

ఆదివారం డీసీజీఐ వీజీ సోమానీ మీడియాతో మాట్లాడుతూ…రెండు క‌రోనా వ్యాక్సిన్లు(కొవిషీల్డ్, కోవాగ్జిన్)110 శాతం సుర‌క్షిత‌మైనవేనని సోమానీ స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ల వ‌ల్ల భద్రత పరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమ‌తి ఇచ్చేవాళ్లం కాద‌ని ఆయ‌న అన్నారు. ఏ వ్యాక్సిన్‌ తో అయినా కాస్త జ్వ‌రం, నొప్పి, అలెర్జీ వంటి స‌మ‌స్య‌లు సాధార‌ణ‌మే అని సోమానీ చెప్పారు. ఇక వ్యాక్సిన్ వ‌ల్ల నపుంస‌కులుగా మారుతార‌ని వ‌స్తున్న పుకార్లని ఆయ‌న కొట్టి పారేశారు. అందులో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు. ఈ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు.

తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించాలని సీడీఎస్‌సీవో (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నిర్ణయించిందన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించినట్లు తెలిపారు. క్యాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

ఇదిలావుండగా, కోవిడ్ వ్యాక్సిన్లపై వదంతుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలను డిసెంబరు 31న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరిన విషయం తెలిసిందే. సందేశాలను సరిచూసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని కోరారు. ఇక, మోడీ ఆదివారం చేసిన ట్వీట్‌ లో భారత దేశం కోవిడ్ రహితం కాబోతోందని, రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. . డీసీజీఐ అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు దేశీయంగా తయారవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మోడీ ట్వీట్‌ లో తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు చెప్పడంతో పాటు దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ఇంకా మూడో ద‌శ ప్ర‌యోగాల్లో ఉన్న‌ప్పుడే అనుమ‌తి ఎలా ఇచ్చారంటూ ప‌లువురు విపక్ష నేతలు ప్ర‌శ్నిస్తున్నారు. కొవాగ్జిన్ కు అనుమతులు మంజూరైన తీరు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలను పక్కనబెట్టి కోవాగ్జిన్‌ అత్యవసర, పరిమిత వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా,భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశ మరియు రెండవ దశ ట్రయల్స్ పూర్తి అవగా,మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు. మూడవ దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మూడోదశ ట్రయల్స్ పాల్గొంటున్న 25,800 మందిలో 22,500 మందికి టీకాలు వేశారు. అయితే, కోవాగ్జిన్ కు “పరిమితం” ఆమోదం ఇస్తున్నట్లు ప్రకటిస్తూ…ట్రయల్స్ ఫలితాలు “సురక్షితమైనవి మరియు బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను అందిస్తున్నాయి” అని డ్రగ్ కంట్రోలర్ జనరల్ విజి సోమాని తెలిపారు.