Power Cut
Power Cuts: దైనందిక జీవితంలో భాగమైన విద్యుత్.. కాసేపు లేకపోయినా అల్లకల్లోలంగా ఫీలవుతాం. వేయి కళ్లతో ఎదురుచూసి పవర్ వచ్చిందని తెలియగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ, పవర్ సప్లై టైం కంటే పవర్ కట్ టైమే ఎక్కువగా ఉంటే ఏం చేయాలి.. అలా విసిగిపోయిన వ్యక్తే.. కర్ణాటకకు చెందిన శివమొగ్గా జిల్లా వాసి.
రోజుకు 4గంటలకు మించి ఉండని విద్యుత్ సరఫరాతో విసిపోయాడు. దానికి వింత పరిష్కారం ఆలోచించాడు. ఎలక్ట్రిసిటీ ఆఫీసుకు మసాలా గ్రైండింగ్ తో పాటు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు రోజూ వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా పది నెలలుగా జరుగుతుందట.
హనుమంతప్ప అనే వ్యక్తి ఇంటికి రోజులో 3నుంచి 4గంటలకు మించి పవర్ సప్లై ఉండటం లేదట. దీంతో రోజులో చాలా వరకూ చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి. తన ఇంటికి పవర్ సప్లై ఉండటం లేదంటూ పలు మార్లు ఫిర్యాదు కూడా చేశాడట. అధికారులు పట్టించుకోకపోగా వాదనకు దిగి.. నీకు కరెంట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కు వచ్చి వాడుకోమని చెప్పారట.
Read Also : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధూవరులు
“ఇంట్లో మసాలా గ్రైండ్ చేసుకోవాలంటే ఎలా. ఫోన్లు ఎలా ఛార్జ్ చేసుకోవాలి. అది కనీస అవసరం కదా. దీని కోసం ప్రతిసారి పక్కింటికి వెళ్లలేను కదా” అని హనుమంతప్ప అడిగిన ప్రశ్నకు.. అంతగా అవసరమైతే MESCOM ఆఫీసకు వచ్చి మసాలా గ్రైండ్ చేసుకోవాలని చెప్పాడు ఆ అధికారి.
ఆ మాటలు సీరియస్ గా తీసుకున్న హనుమంతప్ప పది నెలలుగా మంగళూరు పవర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసుకు కొన్ని ఫోన్ ఛార్జర్లతో పాటు, గ్రైండర్ జార్ తీసుకుని వెళ్తున్నాడు. మసాలాలు గ్రైండ్ చేసుకుని, ఫోన్ ఛార్జింగ్ తో పాటు ఎలక్ట్రిసిటీతో చేసుకోవాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాడు.
హనుమంతప్ప తన ఇంటికి సరైన విద్యుత్ సరఫరా చేయాలని MESCOMతో పాటు సంబంధిత ప్రతి అధికారికి వినతిపత్రం కూడా సమర్పించారు. వర్షాల కారణంగా IP సెట్‌లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదని ఒక జూనియర్ మెస్కామ్ అధికారి తెలిపారు. ఆ వ్యక్తికి ఒక నెలలోపు సరైన విద్యుత్ అందుతుందని హామీ ఇస్తున్నారు అధికారులు.