\
తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపడుతుంది? లేకపోతే అది కూడా “యాక్ట్ ఆఫ్ గాడ్” అనుకుని దేవుని ఖాతాలోనే వేస్తారా? అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..రాహుల్. ఈ విమర్శలు చేశారు.
ఆగస్టు-27,2020న జీఎస్టీ 41వ మండలి సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కోవిడ్ అనేది యాక్ట్ ఆఫ్ గాడ్. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు తగ్గింది. ఫలితంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.