పాకిస్తాన్ కి దబిడి దిబిడే.. మన దగ్గరున్న యుద్ధ విమానాలు చూస్తే.. బ్రహ్మోస్, రఫెల్, సుఖోయ్.. డ్రోన్స్.. ఇంకా..

2019లో బాల్ కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్థాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్నివిధాల సమర్ధతను కలిగిఉంది.

India Defence Forces

India Defence Forces: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్.. ఆ దేశానికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. పాక్ తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయనున్నట్లు భారత్.. అవసరమైతే యుద్ధానికిసైతం వెనుకాడేదిలేదన్న సంకేతాలు ఇస్తోంది.

 

మరోవైపు జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పటికప్పుడు పాక్ సరిహద్దుల్లోని, ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాల్సి వస్తే భారత రక్షణ శక్తి ఏమిటి..? అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 

2019లో బాల్ కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్థాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్నివిధాల సమర్ధతను కలిగిఉంది. భారతదేశ వైమానిక శక్తిసామర్థ్యాల్లో, వ్యూహాత్మక వనరుల్లో బలోపేతమైంది. భారత వైమానిక దళం ఇప్పుడు SCALP క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్ లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై గురిపెట్టగలవు. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్థాన్ లోని సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు.

 

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం.. సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా నాల్గో స్థానంలో ఉంది. పాకిస్థాన్ పన్నెండవ స్థానంకు పడిపోయింది. భారతదేశం 1,455,550 మంది సైనిక దళంతోపాటు 1,155,000 మంది రిజర్వ్ ఫోర్స్ తో 2.5 మిలియన్లకు పైగా పారామిలిటరీ ఫోర్స్ ను కలిగి ఉంది. పాకిస్థాన్ సైనిక బలం 6.5లక్షలు, పారామిలిటరీ దళాలు ఐదు లక్షలు.

 

భారత మిలిటరీ భారతదేశ రక్షణకు వెన్నెముకగా నిలుస్తుంది. ముఖ్యంగా భూమిపై ఉండి సరిహద్దుల్లో రక్షణ పరంగా అనేక అధునాతన వ్యవస్థ భారత్ మిలిటరీ భాగంగా ఉంది. వీటిలో 4,201 ట్యాంకర్లు (T-90 భీష్మ, అర్జున్, ఇతర ట్యాంకర్లు) ఉన్నాయి. సాయుధ వాహనాలు 148,050 కంటే ఎక్కువ ఉన్నాయి. ఆర్టిలరీలు 4,204 ( టోవ్డ్ ఆర్టిలరీ గన్‌లు), రాకెట్ ప్రొజెక్టర్లు 1,338 యూనిట్లు, సెల్ఫ్-ప్రొపెల్డ్ ఫిరంగి వ్యవస్థలు 100 యూనిట్లు కలిగిఉన్నాయి. పాకిస్థాన్ 2,627 ట్యాంకర్లను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో సాయుధ పోరాట వాహనాలు, ఫీల్డ్ ఫిరంగి వ్యవస్థలను కూడా కలిగి ఉంది.

 

గగనతలంలోనూ ఇండియాదే ఆధిపత్యం. భారత వైమానిక దళం మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిగి ఉంది. వాటిలో 513 పైటర్ జెట్లు, 899 హెలికాప్టర్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513, ట్రాన్స్ ఫోర్టు విమానాలు 560కిపైగా ఉన్నాయి. ఆరు ఏరియల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఆ దేశం మొత్తం విమానాల సంఖ్య 1,399. వీటిలో 328 ఫైటర్ జెట్లు, 373 హెలికాప్టర్లతోపాటు ఇంధనం నింపే ట్యాంకర్లు ఇతర సామర్థ్యాలను కలిగి ఉంది. అయినప్పటికీ పాకిస్థాన్ కంటే భారత వైమానిక దళ సామర్థ్యం ఎక్కువ.

 

భారత నావికా దళం రోజురోజుకు బలోపేతం అవుతుంది. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. భారత నావికాదళంలో మొత్తం 293 యుద్ధ నౌకలు (ships) ఉన్నాయి. వీటిలో విమాన వాహక నౌకలు రెండు (INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్), జలాంతర్గాములు 18, డిస్ట్రాయర్లు 13, ఫ్రిగేట్లు 13, కార్వెట్ లు 23, గస్తీ నౌకలు 135 కలిగి ఉంది. భారతదేశం నావికాదళ సామర్థ్యం పాకిస్థాన్ కంటే చాలా ఎక్కువ. పాకిస్థాన్ 121 నౌకలను (ships) కలిగి ఉంది. ఈ విభాగంలో ప్రపంచంలో పాకిస్థాన్ 27వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ వద్ద విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు లేవు. కేవలం ఎనిమిది జలాంతర్గాములను మాత్రమే కలిగి ఉంది.