Chandrayaan-4 : చంద్రుడిపై మట్టి, రాళ్లు తేవటమే లక్ష్యంగా చంద్రయాన్ -4పై ఇస్రో దృష్టి

చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రచంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగంపై దృష్టి పెట్టింది. అదే చంద్రయాన్ -4. వరస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్ -4 తో మరో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.

_ISRO Chandrayaan-4

ISRO Chandrayaan-4 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో..చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసింది. భారత్ ను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చేసింది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. కీలక విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో మరింత ఉత్సాహంగా చంద్రుడుపై దాగున్న రహస్యాలపై కన్నేసింది. చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ తరువాత మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టటం దీనికి నిదర్శనంగా భావించవచ్చు. దీంట్లో భాగంగానే ఇస్రో ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రయాన్ -4పై దృష్టి పెట్టింది. ఈ మిషన్ తో చంద్రుడినుంచి మట్టితో పాటు చిన్నపాటి రాళ్లను కూడా తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఇస్రో చంద్రయాన్ -4కు రంగం సిద్ధం చేస్తోంది.

పూనెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలనీ 62వ స్థాపక దినోత్సవం సందర్భంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC/ISRO) డైరెక్టర్ నీలేష్ దేశాయ్ చంద్రయాన్-4 గురించి అత్యంత ఆసక్తికర విషయాలను వెల్లడించటంతో ఇప్పుడంతా అదే ప్రాజెక్టు గురించే చర్చ నడుస్తోంది. చంద్రయాన్-4 కూడా సక్సెస్ అయితే ఇక యావత్ ప్రపంచం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే.

ఇక చంద్రయాన్ -4 గురించి నీలేష్ దేశాయ్ చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చంద్రయాన్-3 విజయం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అదే ఉత్సాహంతో చంద్రయాన్-4తో చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి, చిన్నపాటి రాళ్లను తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రయోగం ఉండనుంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ఇది చంద్రయాన్-3 కంటే కష్టమైనదని భావిస్తున్నామన్నారు.

తమ అంచనాల ప్రకారం..చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండ్ దిగుతుందని..దీంట్లో 350 కిలోల బరువున్న రోవర్ ను పంపనున్నామని తెలిపారు. (కాగా..చంద్రయాన్ -3లో 30కిలోలు అనే విషయం తెలిసిందే) అంటే చంద్రయాన్-3 కి అంతకు మించి అన్నట్లుగా ఈ చంద్రయాన్-4 ఉందనుంది అనే విషయం తెలుస్తోంది. ఈ చంద్రయాన్ -4 చంద్రుడిపై కిలోమీటర్ మేర తిరుగాడుతుందని చంద్రుడిపై కచ్చితమైన ల్యాండింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని..తెలిపారు. ఇదో పెద్ద సవాలుగా భావిస్తున్నామని తెలిపారు. చంద్రుడి చీకటి కోణాన్ని అన్వేషించే క్రమంలో ఇస్రో చంద్రయాన్‌-4 ప్రాజెక్ట్ కోసం జపాన్‌ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ సహకరించటం మరో విశేషంగా భావించవచ్చు. చంద్రయాన్- 3 సక్సెస్ తో  చంద్రయాన్ 4 పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగాయి. చంద్రయాన్-4తో ఇస్రో అనుకున్న లక్ష్యాలు సాధించగలిగితే ఇక భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే ఘనతను సాధించినట్లే.