ISRO Mega Rocket: మన ఇస్రో అదరహో.. అత్యంత శక్తిమంతమైన 40 అంతస్తుల మెగా రాకెట్‌.. ఇక 75,000 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లి..

నాసా స్పెషల్‌ లాంచ్‌ సిస్టమ్‌, స్పేస్‌ X స్టార్‌షిప్ ఇదే తరహా పేలోడ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నాయి. చైనా లాంగ్‌ మార్చ్‌9పై దృష్టి పెట్టింది.

ISRO Mega Rocket

ISRO Mega Rocket: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ISRO) అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది 40 అంతస్తుల ఎత్తుతో, 75,000 కిలోగ్రాముల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌ (LEO)లో ప్రవేశపెడుతుంది.

ఈ ప్రాజెక్ట్‌ గురించి ఐస్రో చైర్మన్ వి.నారాయణన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో వివరాలు తెలిపారు.

35 కిలోల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 75,000..

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పర్యవేక్షణలో తయారైన తొలి స్వదేశీ రాకెట్‌ 17 టన్నుల బరువు ఉండేది. అది కేవలం 35 కిలోల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌ (LEO)లో ప్రవేశపెట్టేది.

“ఇప్పుడు మేము 75,000 కిలోగ్రాముల పేలోడ్‌ను ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే రాకెట్‌పై దృష్టిపెట్టాం. ఈ రాకెట్ 40 అంతస్తుల భవనం ఎత్తంత ఉంటుంది” అని నారాయణన్ చెప్పారు. ఇది భారత టెక్నాలజీలో మైలురాయి అని అన్నారు.

గ్లోబల్ ప్రాముఖ్యత

నారాయణన్‌ చేసిన ప్రకటనతో అమెరికా, చైనా, రష్యా సరసన ఇండియా చేరింది. ఆయా దేశాలు కూడా సూపర్ హెవీ లాంచ్ వెహికల్స్‌ కోసం పనిచేస్తున్నాయి. నాసా స్పెషల్‌ లాంచ్‌ సిస్టమ్‌, స్పేస్‌ X స్టార్‌షిప్ ఇదే తరహా పేలోడ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నాయి. చైనా లాంగ్‌ మార్చ్‌9పై దృష్టి పెట్టింది.

గగనయాన్, డీప్-స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌, చంద్రయాన్, మంగళయాన్ మిషన్లకు ఐస్రోకు చెందిన ఈ భారీ రాకెట్ గేమ్ ఛేంజర్ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. మొత్తం స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్‌, పెద్ద ఉపగ్రహ సమూహాలు, పరిశోధన పరికరాలను ఒకే మిషన్‌లో భారత్‌ లాంచ్ చేయగలుగుతుందని చెబుతున్నారు.

రక్షణ, ఆర్థిక ప్రయోజనాలు

ఈ రాకెట్ ప్రాజెక్ట్‌ వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా కలిగి ఉంది. కమ్యూనికేషన్‌, సర్వైలెన్స్ ఉపగ్రహాల వృద్ధితో ఇండియన్ ఓషన్ రీజియన్‌ (IOR)లో డిఫెన్స్ సిద్ధత మెరుగవుతుంది.

ఆర్థికంగా, గ్లోబల్ కమర్షియల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్‌లో ఇండియాకు వాటా పెరుగుతుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌, అరియన్ స్పేస్, రోస్కోస్మోస్ ఆధిపత్యంలో ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఇప్పుడు ఇండియా కూడా ఇందులో ముందుకు వస్తుంది. 35 కిలో పేలోడ్‌ను స్పేస్‌లో ప్రవేశపెట్టే స్థాయి నుంచి 75,000 కిలోల పేలోడ్‌ను ప్రవేశపెట్టే రాకెట్ల దాకా ఇస్రో జరిపిన జర్నీ భారత్‌ అంతరిక్ష రంగంలో ఏ మేరకు ఎదిగిందో తెలుపుతుంది.

ఒకప్పుడు విదేశీ లాంచర్లపై ఆధారపడిన ఇండియా.. ఇప్పుడు చంద్రయాన్-3, మంగళయాన్‌ (మార్స్ మిషన్‌) వంటి ప్రాజెక్టులతో తక్కువ ఖర్చుతో విజయవంతంగా మిషన్లను చేపట్టి అంతర్జాతీయంగా విశ్వాసం పొందింది.

2025లో ఐస్రో రోడ్‌మ్యాప్‌ ఇదే

  • NAVIC (నేవిగేషన్ విత్ ఇండియన్ కన్స్‌టెల్లేషన్) ఉపగ్రహాలు — స్వతంత్ర GPS వ్యవస్థను బలపరచడానికి.
  • కొత్త N1 రాకెట్ — హెవీ లిఫ్ట్ లాంచ్‌లకు ప్రధాన ఆధారం.
  • 6,500 kg అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం లాంచ్ — ఇండియా లాంచ్ వెహికల్స్‌పై గ్లోబల్ నమ్మకానికి ఇది సూచీ.
  • టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్ శాటిలైట్‌ (TDS)ను ప్రవేశపెట్టడం.
  • GSAT-7R లాంచ్ — ఇండియన్ నేవీ కోసం మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం, పాత GSAT-7 (రుక్మిణి) స్థానంలో.

ఉపగ్రహాల సంఖ్య మూడింతలు అయ్యేలా..

ప్రస్తుతం అంతరిక్షంలో మన 55 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇవి నావిగేషన్‌, కమ్యూనికేషన్‌, డిఫెన్స్‌, వాతావరణ శాస్త్రం, ఎర్త్ అబ్జర్వేషన్‌ కోసం ఉన్నాయి.

నారాయణన్ తెలిపిన వివరాల ప్రకారం 3–4 సంవత్సరాల్లో ఉపగ్రహాల సంఖ్య మూడింతలు అవుతుంది. దేశీయ మిషన్లు, గ్లోబల్ కమర్షియల్ లాంచ్‌లు రెండూ పెరుగుతాయి.