ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5) రాకెట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ “షార్” రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా భారతదేశపు అత్యంత బరువైన (4,410 కిలోలు) కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రక్రియ నిన్న సాయంత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక మన సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. హిందూ మహా సముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్ పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే, సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ ప్రకటించారు. ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని చాలా మంది స్కూల్ విద్యార్థులు శ్రీహరికోటకు వచ్చి స్వయంగా చూశారు.
దేశ అంతరిక్ష సామర్థ్యాల్లో ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5) రాకెట్ ప్రయోగం ఓ మైలురాయిగా నిలుస్తోంది. ఇక విదేశీ రాకెట్లపై ఆధారపడకుండా భారత భూభాగం నుంచే భారీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది.
ఎల్‌వీఎం3-ఎం5 అనేది లాంచ్ వెహికల్ మార్క్-3 (ఎల్‌వీఎం3) ఐదవ ఆపరేషనల్ ప్రయోగం. ఇది ఇస్రో అభివృద్ధి చేసిన ప్రధాన హెవీ లిఫ్ట్ రాకెట్. ఇది జీటీఓకి 4,000 కిలోల వరకు, లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో)కి 8,000 కిలోల వరకు పెలోడ్ మోస్తుంది. 43.5 మీటర్ల ఎత్తుతో, 642 టన్నుల లిఫ్టాఫ్ మాసుతో ఉన్న ఈ రాకెట్.. తక్కువ ఖర్చుతో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కచ్చితమైన రీతిలో కక్ష్యల్లో ప్రవేశపెట్టేలా రూపుదిద్దుకుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘బాహుబలి’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అత్యంత భారమైన పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది.