It Should Be 'Main Front', Not 'Third Front' say CM Nitish Kumar
CM Nitish Kumar : బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం నితీశ్ కుమార్ జోరుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విపక్ష పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. వారితో పలు అంశాలపై చర్చిస్తున్నారు. 2024 ఎన్నికలకల్లా బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో నితీశ్ కుమార్ వ్యూహాలు రచిస్తున్నారు. దీంట్లో బాగంగానే ఢిల్లీలో పర్యటిస్తూ బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదేసమయం అని భావిస్తున్న నితీశ్ ఢిల్లీలో పలువురు కీలక నేతలతో సమావేశమవుతున్నారు.
మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌటాలా, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు..యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్,సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య,ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు నితీష్ కుమార్.
ఈ కీలక సమావేశాల సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ..పలు రాష్ట్రాల్లోని బిజెపియేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని అన్నారు. నేను నాయకుడిని కాను..కేవలం ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించేందుకు యత్నిస్తున్నాను.అందరూ కలిసి ఎన్నికల్లో పోరాడితేనే విజయం సాధిస్తామని అన్నారు. బీజేపీయేతర పార్టీలంతా ఐక్యంగా.. ఒక ప్రధాన ఫ్రంట్‌ని నిర్మిస్తాము..అది థర్డ్ ఫ్రంట్ కాదు…అదే ప్రధాన ఫ్రంట్ అని అన్నారు.