Taj Mahal: తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, షాజహాన్ లాక్కున్నాడు: పత్రాలు కూడా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ

తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని, ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది

Taj Mahal: ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై భారత్ లో గత కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం తాజ్ మహల్ ఉన్న స్థలంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని, తాజ్ మహల్ లోపల ఇప్పటికి శివలింగం ఉందని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు తాజ్ మహల్ లోని గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు మరియు శాసనాలు దాచబడ్డాయని, లోపల ఉన్న 22 గదులను తెరవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇదిలాఉంటే..అసలు తాజ్ మహల్ ఉన్న స్థలం మొత్తం జైపూర్ రాజ వంశీకులదేనని, గతంలో అక్కడ ఉన్న తమ పూర్వీకుల భవనాలను కూల్చివేసి, ఆ స్థలాన్ని ఆక్రమించిన షాజహాన్ అక్కడ తాజ్ మహల్ నిర్మించినట్లు రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దివ్యకుమారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్ రాజవంశానికి చెందిన మూడోతరం మహిళ ఈ దివ్యకుమారీ.

Also read:Corbevax Vaccine: అత్యవసర బూస్టర్ డోసుగా కార్బెవాక్స్: డీజీసీఐకి ధరఖాస్తు చేసిన ‘బయోలాజికల్ ఈ’

భారతదేశంలో బ్రిటీష్ రాజ్ సమయంలో జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజు అయిన మాన్ సింగ్ II మనవరాలు ఈ దివ్యకుమారీ. తాజ్ మహల్ నిర్మించిన స్థలంలోనే గతంలో తమ పూర్వీకులకు ప్యాలెస్ ఉండేదని, ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని నిరూపించే పత్రాలు సైతం తన వద్ద ఉన్నాయని ఎంపీ దివ్యకుమారీ పేర్కొంది. షాజహాన్ అధికారంలో ఉన్న సమయంలో అతడు ఆ భవనాన్ని బలవంతంగా లాక్కుని భవనాన్ని కూల్చివేసి తాజ్ మహల్ కట్టినట్లు దివ్యకుమారీ చెప్పుకొచ్చారు. నేడు ప్రభుత్వం భూసేకరణ చేపడితే పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆమె అన్నారు. “అప్పట్లో అలాంటి చట్టం లేదు. అయితే ఈ భూమి జైపూర్ రాజకుటుంబానికి చెందినదని స్పష్టమవుతోంది. ఆ భూమి మాదేనని నిరూపించే పత్రాలు మా వద్ద ఉన్నాయి. కోర్టు అడిగేతే ఆ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము.” అని ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యకుమారి పేర్కొన్నారు.

Also read:Corbevax Vaccine: అత్యవసర బూస్టర్ డోసుగా కార్బెవాక్స్: డీజీసీఐకి ధరఖాస్తు చేసిన ‘బయోలాజికల్ ఈ’

అయితే తాజ్ మహల్ ను కూల్చివేయమని తాము చెప్పడంలేదని..అయితే నిజానిజాలు తెలియాలంటే విచారణ జరగాలని ఆమె అన్నారు. ఇటీవల పలు సంఘాల నుంచి వచ్చిన ఆరోపణలు ధృవీకరించడానికి విచారణ నిర్వహిస్తేనే అన్ని వాస్తవాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయని ఎంపీ దివ్యకుమారీ తెలిపారు. 1631-32లో ప్రారంభమైన తాజ్ మహల్ నిర్మాణం 22 ఏళ్ల అనంతరం 1653లో పూర్తయింది. దాదాపు 475 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ పాలరాతి అతిశయం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు