Digital Tree Aadhaar: ఆ చెట్లను కాపాడేందుకు ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్యక్రమం.. ఎక్కడ.. ఎందుకో తెలుసా?

జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో చినార్ చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చెట్ల సంరక్షణ, పెరుగుదల కోసం ప్రత్యేక దృష్టిసారించింది. ఆ రాష్ట్రంలో వేలాది చినార్ చెట్లు ఉన్నాయి.

Digital Tree Aadhaar

Digital Tree Aadhaar: భారతదేశంలో పౌరులుగా గుర్తింపుకోసం, ప్రభుత్వ పథకాల లబ్ధిపొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అదే తరహాలో చెట్ల పరిస్థితిపై డేటాబేస్ ను సమీకరించడానికి ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయిస్తారు. వీటి సాయంతో ఆ వృక్షం ఉన్న నిర్ధిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రక్రియ ఎక్కడ మొదలు పెట్టారు.. ఎందుకంటే..? జమ్మూ కశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం చినార్ చెట్లు. ఈ చెట్లను రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది.

Also Read: Retirement age: ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ పెంచడం ఖాయమా? నిరుద్యోగులకు మళ్లీ నిరాశ తప్పదా?

జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో చినార్ చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చెట్ల సంరక్షణ, పెరుగుదల కోసం ప్రత్యేక దృష్టిసారించింది. ఆ రాష్ట్రంలో వేలాది చినార్ చెట్లు ఉన్నాయి. అయితే.. గత కొన్ని దశాబ్దాలుగా వందల సంఖ్యలో చినార్ చెట్లు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం పట్టణీకరణం, అడవుల ఆక్రమణల వల్ల చినార్ చెట్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వాటిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సంస్థ ‘డిజిటల్ ట్రీ ఆధార్’ తో ముందుకొచ్చింది. మనుషులకు ఆధార్ కార్డులో ఉన్న వివరాల వలే.. అక్కడ చెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఆ చెట్టుకు నెంబర్, ఇతర వివరాలతో కూడిన ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్డును అమర్చుతారు. ప్రస్తుతానికి 29,000 చినార్ వృక్షాలను గుర్తించి వాటి వివరాలను నమోదు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read: Haryana Trees Pension : చెట్లకు పెన్షన్ ప్రకటించిన హర్యానా ప్రభుత్వం .. ఎందుకో తెలుసా..?!

చినార్ చెట్లకు ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్డు ఏర్పాటుపై ప్రాజెక్టు సమన్వయ కర్త సయ్యద్ తారిఖ్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ ట్రీ ఆధార్ కింద ప్రతి చినార్ చెట్టుపై క్యూఆర్ కోడ్ ఇన్ స్టాల్ చేయడం జరుగుతుంది. చెట్టు ఎక్కడ ఉంది.. దాని వయస్సు ఎంత.. ఆ చెట్టు ఆరోగ్యం, పెరుగుదల నమూనాలతో సహా 25రకాల సమాచారాన్ని కోడ్ లో నమోదు చేయడం జరుగుతుంది. దీంతో పర్యావరణ వేత్తలు ఆ చెట్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాటికి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా చెట్ల గురించిన సమగ్ర సమాచారాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే 29,000 చినార్ చెట్లకు డిజిటల్ ట్రీ ఆధార్ కార్డును పొందుపర్చాం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. చిన్న చెట్లకు సంబంధించి ఇంకా డిజిటల్ ట్రీ ఆధార్ ను అమర్చలేదు. త్వరలోనే వాటికి కూడా అమర్చుతామని తారిక్ చెప్పారు.

 

1947కి ముందు జమ్మూ కశ్మీర్ లో చినార్ల సంఖ్య 45వేలకుపైగా ఉండేది. 1980 తరువాత వాటి సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. 2017లో నిర్వహించిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 35వేల చినార్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో నాటిన చెట్లు కూడా ఉన్నాయి. అయితే, 2020 నుంచి అక్కడి ప్రభుత్వం చినార్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. చినార్ దినోత్సవం రోజు కొత్త మొక్కలు నాటుతారు.