blind student
Saurabh Gets a Job In Microsoft: జార్ఖండ్‌లోని అంధ యువకుడు అద్భుతాలు చేశాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు. తన తండ్రి ప్రేరణ, తన స్వంత కృషితో అతను ఐఐటీ ఢిల్లీకి వెళ్ళాడు. ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్‌లో రూ. 51 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. ఆ అంధుడు పేరు సౌరభ్. అతను ఛత్రలోని తాండ్వా నివాసి. సౌరభ్ చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడని, అయితే చిన్నతనం నుంచి ఏదో ఒకటి సాధించాలన్న కోరికతో పట్టుదలతో కృషిచేస్తూ వచ్చాడని సౌరభ్ తండ్రి మహేష్ ప్రసాద్ గుప్తా చెప్పారు.
సౌరభ్ చిన్నప్పటి నుంచి గ్లకోమా వ్యాధితో బాధపడుతున్నాడు. మూడో తరగతి తర్వాత అతని కంటిచూపు పూర్తిగా పోయింది. ఆ తరువాత చదువును కొనసాగించాలని అనుకున్నాడు. తండ్రి మహేష్‌సైతం అతన్ని ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని సంత్ మిఖాయిల్ స్కూల్లో చేర్పించాడు. అక్కడే సౌరభ్ ఏడో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత ఒక పెద్ద సమస్య అతని ముందుకు వచ్చింది. 8వ తరగతి నుండి 10వ తరగతి పుస్తకాలు బ్రెయిలీ లిపిలో ముద్రించబడలేదు. అప్పుడు సౌరభ్ తన కష్టమంతా వృధా అని భావించాడు. సౌరభ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం పుస్తకాలను ముద్రించింది. దీని తర్వాత అతను ఎన్ఐవీఎస్ డెహ్రాడూన్ స్కూల్లో అడ్మిషన్ పొందాడు.
సౌరభ్ డెహ్రాడూన్‌లో చదువుతూ మెట్రిక్యులేషన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. సౌరభ్ 2017లో 9.8 CGPA సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అడ్మిషన్ పొందారు. ఇక్కడ కంప్యూటర్ సాయంతో సాధారణ విద్యార్థులతో కలిసి విద్యాబోధన మొదలైంది. 2019లో ఐఎస్‌సీలో 93శాతం మార్కులు సాధించాడు. అదే సమయంలో జేఈఈ మెయిన్స్‌లో కూడా అర్హత సాధించాడు. ర్యాంకు ఆధారంగా ఢిల్లీ ఐఐటీలో అడ్మిషన్ పొందాడు. ప్రస్తుతం సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న సౌరభ్ మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆ కంపెనీ నుంచి రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది పట్టుదలతో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు.