పని మీద ఊరు వెళ్తుంటాం.. సడెన్‌గా ఛార్జింగ్ అయిపోద్ది. ఇంతలో పబ్లిక్‌లో ఉండే ఓ ఛార్జిగ్ పాయింట్ వద్ద వైరు ఉంది కదా? అని ఛార్జింగ్ పెట్టేసుకుంటాం కదా? అయితే ఇది చాలా ప్రమాదం.. నిజంగా ఇది వాస్తవం.. లేటెస్ట్‌గా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఢిల్లీకి ఇటీవల ఓ టూర్‌కి వెళ్లాడు ఓ యువకుడు. తన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడంతో దగ్గరలోని ఛార్జింగ్ పోర్ట్ దగ్గరకు వెళ్లి అక్కడున్న యూఎస్‌బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ, కొద్దిసేపటికే అతని బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యింది.
అంతేనా.. నీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మా దగ్గరున్నాయ్.. అడిగినంత డబ్బు అకౌంటుకు కొట్టు.. అంటూ బెదరింపులు.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని నీ ఫోన్‌లో ఉన్న నెంబర్లకు పంపిస్తా.. కాల్ చేశారు. దాంతో ఆ యువకుడికి చమటలు పట్టాయి. పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు యువకుడు. అసలు విషయం అక్కడ బయటపడింది. యువకుడి ఫోన్ జ్యూస్ జాకింగ్‌కు గురైనట్లు గుర్తించారు.
జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటంటే… సులభంగా చెప్పాలంటే గ్లాసులో ఉన్న జ్యూస్‌ని స్ట్రాతో తాగినట్లు.. యూఎస్‌బీ పోర్టు ఛార్జర్ ద్వారా మన ఫోన్లో డేటా అంతా కొట్టేయడం. స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ చేసుకోవడానికి పలు సంస్థలు, కార్యాలయాలు ఇటీవలి కాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో స్మార్ట్ పరికరాలు ఛార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్ పోర్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.
ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పైకి నాలుగైదు యూఎస్‌బీ కేబుల్స్ ఉంటాయి. ఫోన్ కానీ, ల్యాప్‌టాప్ కానీ వాటికి కనెక్ట్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఛార్జింగ్ కోసం పెట్టిన యూఎస్‌బీ పోర్టులను మార్చేస్తున్నారు. వాటి స్థానంలో అచ్చం అలాగే ఉండేలా సొంతంగా తయారుచేసిన పోర్టులను పెట్టేస్తున్నారు. ఎవరైనా వారి ఫోన్లు, లాప్ టాప్‌లు ఛార్జింగ్ చేసుకునేందుకు వీటికి కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. డేటాను యూఎస్‌బీ పోర్టు నొక్కేస్తుంది.