Justice R Gogoi : గొగొయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం..పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్

తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ,రాజ్యసభ ఎంపీ రంజన్ గొగొయ్ పై సోమవారం

Justice R Gogoi : గొగొయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం..పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్

Gogoi2

Updated On : December 13, 2021 / 5:28 PM IST

Justice R Gogoi : తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ,రాజ్యసభ ఎంపీ రంజన్ గొగొయ్ పై సోమవారం పార్లమెంట్ లో తృణముల్ కాంగ్రెస్ ప్రివిలేష్ మోషన్ ప్రవేశపెట్టింది. గోగోయ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ ధిక్కారంగా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయని, ప్రత్యేక అధికారాలపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని తృణముల్ కాంగ్రెస్ పార్లమెంట్ కు సమర్పించిన నోటీసులో పేర్కొంది.

కాగా, గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన గొగొయ్.. సమావేశాల హాజరు శాతం పదిలోపే ఉంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ విషయమై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంజన్‌ గొగొయి మాట్లాడుతూ…”నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. అసోం నుంచి వచ్చిన నేను ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై సభలో గళం విప్పాలనే భావించా. కానీ, కరోనా వ్యాప్తి.. డాక్టర్ల సూచనల మేరకు సమావేశాలకు హాజరుకావట్లేదు. ఈ మేరకు రాజ్యసభకు లేఖ కూడా పంపించాను. అయినా.. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తేనే సభకు వెళ్తాను. నేను నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికైన రాజ్యసభ స్వతంత్ర సభ్యుడిని. నన్ను ఏ పార్టీ ఆదేశించలేదు. నాకు నచ్చినప్పుడు వస్తా.. నచ్చినప్పుడు వెళ్తా. ఇంకా కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. ఈ సమయంలో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నా.. సభలో అది జరగట్లేదు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ కూడా అసౌకర్యంగా ఉంది”అని అన్నారు.

అంతేకాకుండా రాజ్యసభలో మాయాజాలం ఏముందని గొగొయ్ ప్రశ్నించారు. దీనికంటే తాను ఏ ట్రిబ్యునల్‌కో చైర్మన్‌గా ఉండి ఉంటే వేతనాలు, పారితోషికాల విషయంలో మెరుగ్గా ఉండేవాడేనని,తాను రాజ్యసభ నుండి పైసా కూడా తీసుకోవడం లేదని గొగొయ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, గొగొయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడింది. నచ్చినప్పుడే రాజ్యసభకు వెళ్తా అంటూ గొగొయ్ చేసిన వ్యాఖ్యలు..పార్లమెంట్ కి అవమానం అని సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ పేర్కొన్నారు. పార్లమెంట్ కేవలం మాట్లాడటానికి మాత్రమే వేదిక కాదని,వినేందుకు కూడా పార్లమెంట్ వేదిక అని జైరామ్ రమేష్ ఓ ట్వీట్ లో తెలిపారు.

ALSO READ BJP MLA Died : నిద్రలోనే కన్నుమూసిన సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే..మోదీ సంతాపం