ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్‌హాసన్

  • Publish Date - March 25, 2019 / 05:01 AM IST

తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదని ప్రకటించారు. రథం మీద కూర్చోవడం కంటే రథం లాగడమే  ప్రధాన కర్తవ్యంగా నిర్ణయించుకున్నానని కమల్ హాసన్ వెల్లడించారు. తన పార్టీ తరుపున పోటీలో ఉన్న వ్యక్తులందరూ తన ప్రతిరూపాలేనని, వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

సమాన వేతనం, మహిళలకు రిజర్వేషన్లు, అందరికీ ఉద్యోగాలు లాంటి పలు అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన.. రాబోయే ఐదేళ్లలో 50లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, ఫ్రీ వైఫై, రహదారులపై టోల్‌ ఫీజుల రద్దు లాంటి పలు అంశాలపై మేనిఫెస్టోలో చేర్చారు.

ఈ సంధర్భంగా ప్రధాని మోడీపై  విమర్శలు గుప్పించిన కమల్.. మోడీ ధనవంతులకు చౌకీదార్(కాపలాదారుడు) అంటూ ఎద్దేవా చేశారు. 21 మందితో కూడిన తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసిన కమల్‌హాసన్.. చిన్న పార్టీయైన ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’తో కలిసి ఎన్నికలకు వెళ్లారు.