పాడైన రోడ్లు, నాలాల సమస్యలు.. రాజకీయ జీవితంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన రాజకీయ జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ 2024లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తన రాజకీయ జీవితంపై కంగనా రనౌత్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నానని అన్నారు.

కంగనా తన రాజకీయ జీవితం గురించి ఓ యూట్యూబ్ ఛానల్‌‌లో పాడ్‌కాస్ట్‌ సందర్భంగా మాట్లాడారు. మీ రాజకీయ జీవితం ఎలా ఉందని ప్రశ్నించగా.. నాకు బాగా అర్ధమవుతుంది. నేను రాజకీయాలను ఆస్వాదిస్తున్నానని చెప్పను. ఇది చాలా భిన్నమైన రంగం. ఇది నా నేపథ్యం కాదు. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను. కానీ, అది వేరే విషయం.

నేను ఎంపీని. కానీ, ప్రజలు నా దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు చూసి ఆశ్చర్యం కలుగుతుంది. నా వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలు తీసుకొస్తున్నారు. రోడ్లు బాగాలేదని, డ్రెయిన్లు బాగుచేయాలని చెబుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిదని నేను వాళ్లకు చెప్పినా అర్ధం చేసుకోరు. మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారంటూ కంగనా చెప్పుకొచ్చింది.

మీరు రాజకీయ రంగంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. ఆ పాత్రకు నేను తగినంత సమర్థురాలిని కాదు. ఆ కోరిక కూడా నాకు లేదు. సామాజిక సేవ నా నేపథ్యం కాదు. పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యే మనస్తత్వం నాది కాదు. నాకు లగ్జరీ సదుపాయాలను అనుభవించాలనే స్వార్థం కూడా ఉంది. నేను జీవించిన జీవితం అలాంటిది అంటూ కంగనా అన్నారు.

దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి పంపాడో నాకు తెలియదు. కానీ, నా జీవితాన్ని త్యాగం చేసే ఉద్దేశం నాకు లేదు. అలాంటి జీవితం నాకు నచ్చదు అంటూ కంగనా స్పష్టం చేశారు.

కంగనా రనౌత్ బీజేపీ టికెట్‌పై 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.