Ranya Rao: నటి రాన్యారావు బంగారం స్మగ్లింగ్ వెనక పెద్దల హస్తం..? చిక్ మంగళూరుతో లింకేంటి.. సంచలన విషయాలు వెలుగులోకి..
కర్ణాటకలో రాన్యారావు అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. కెంపేగౌడ ఎయిర్ పోర్టులో దాదాపు 14కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ..

Kannada actress Ranya Rao
Kannada actor Ranya Rao: కన్నడ నటి రాన్యారావు అరెస్టు సంచలనంగా మారింది. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఏకంగా దుస్తుల్లో రూ.12కోట్ల విలువైన 14.8 కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది. అసలు నటి రాన్యారావు ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అంతమొత్తంలో తరలిస్తున్న బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది..? దీని వెనుక పెద్దల హస్తం ఏమైనా ఉందా..? పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు రాన్యారావు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది.. బంగారం స్మగ్లింగ్ కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రాన్యారావు కేసులో ఆసక్తికర విషయాలతో పాటు సంచలనం కలిగే నిజాలు కూడా బైటపడుతున్నాయి.
కర్ణాటకలో రాన్యారావు అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. కెంపేగౌడ ఎయిర్ పోర్టులో దాదాపు 14కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన రాన్యారావు ఐపీఎస్ కుమార్తె కావటం గమనార్హం. కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాకు చెందిన వ్యక్తి రాన్యారావు. ఆమె తల్లి కాఫీ రైతు కుటుంబం నుంచి రాగా.. తండ్రి రామచంద్ర రావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అయితే, రాన్యా రావు స్మగ్లింగ్ హస్తం వెనుక తండ్రి హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రిని అడ్డుపెట్టుకొని ఇంతఈజీగా బంగారాన్ని తరలిస్తుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి.
పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సార్లు విదేశీ ప్రయాణం చేయడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్‌కి ఈమె కదలికలపై అనుమానం వచ్చింది. ఇలా తరచుగా నాలుగుసార్లు ఎందుకు దుబాయ్ వెళ్లిందనే అనుమానాలు కలగడంతో ఆమెపై నిఘా పెట్టారు. మార్చి 2వ తేదీ రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ప్లైట్ ద్వారా వస్తుండటంతో విమానాశ్రయంలో దిగగానే అధికారులు రాన్యారావును అదుపులోకి తీసుకున్నారు. ఆమెని తనిఖీ చేయగా.. తన దుస్తుల్లో బంగారు కడ్డీలను దాచిన విషయం బయటపడింది. తాను ధరించిన జాకెట్‌లోనే మూడుకేజీల బంగారం దాచినట్లు కూడా అనధికార సమాచారం. కాగా.. ఇలా పట్టుబడిన బంగారం విలువ 12కోట్ల 56 లక్షల రూపాయలుగా తేల్చారు.
ఇంత ప్రొఫెషనల్‌గా బంగారం స్మగ్లింగ్ చేయడం వెనుక రాన్యారావు ఒక్కతే లేదని.. ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలోనూ ఇలానే చేసిందని, దానికి తనకున్న సంబంధాలను వాడుకుని కస్టమ్స్ చెకింగ్ తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు. ఇక రాన్యారావుని పోలీసులు ఆర్ధికనేరాల కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
మరోవైపు రాన్యారావ్ తండ్రికి ఉన్న హోదాని అడ్డం పెట్టుకుని కూడా ఈ స్మగ్లింగ్ జరుగుతుందా అనే కోణంలోనూ డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాన్యారావ్ తండ్రి రామచంద్రరావ్‌ని బెంగళూరు డిఆర్ఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, రాన్యారావ్ కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదని, తన కూతురు, అల్లుడు వ్యాపారం గురించి తనకేం తెలియదని రామచంద్రరావు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, నాలుగు నెలల కిందటే ఆమెకు వివాహం జరిగింది. మరోవైపు రాన్యారావ్ ఇంట్లోనూ సోదాలు చేశారు.
ప్రస్తుతానికి రాన్యారావుపై కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు కాగా.. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈమె అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. 2014లో సుదీప్ సరసన మాణిక్యలో హీరోయిన్‌గా చేయగా, పటాకీ, వాఘాలోనూ నటించింది. వర్ధమాననటిగా మాత్రమే తెలిసిన రాన్యారావ్.. ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.