Karnataka Polls: ఒక్క ప్రకటనతో తలకిందులైన రాజకీయం.. కాంగ్రెస్ వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా?

అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.

Karnataka Polls: ఒక్కమాటతో సానుకూలంగా కనిపిస్తున్న రాజకీయాన్ని తలకిందులు చేసుకుంది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారం మొదలైన నుంచి మోదీ మినహా మిగిలిన నేతలు ఎవరూ కాంగ్రెస్‌ను అడ్డుకోలేకపోయారు. మోదీ వచ్చాకే కర్ణాటకలో బీజేపీ ప్రచారంలో కాస్త ఊపు కనిపించింది. అయినప్పటికీ కాంగ్రెస్‌కే కాస్త మొగ్గు కనిపించింది. కానీ బజరంగ్‌దళ్ (bajrang dal) నిషేధ ప్రకటన కాంగ్రెస్ నోటి నుంచి వచ్చిన వెంటనే బీజేపీ జోరు పెంచింది. ఇది కాంగ్రెస్ స్వీయ, సొంత తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు. అసలు కాంగ్రెస్ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా?


కాంగ్రెస్‌లో అంతర్మథనం

కర్ణాటక కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. రెండు రోజుల క్రితం బజరంగ్‌దళ్ నిషేధిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఆ ప్రకటన చేస్తున్న రచ్చతో పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (dk shivakumar) కనిపించిన గుడికల్లా వెళ్లి మొక్కుతున్నారు. తాను భక్తుడునని చాటుకుంటున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అదంతా బీజేపీ డ్రామా.. లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. వీరప్పమొయిలీ, జగదీశ్ షెట్టర్ ఇలా ఒకరేమిటి కాంగ్రెస్ నాయకగణమంతా హిందూ సెంటిమెంట్ ప్రబలకుండా జాగ్రత్త పడుతున్నారు.


సిద్ధాంతాలను పక్కనపెట్టిన బీజేపీ

ఎన్నికల ప్రచారం మొదలైన నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ జోరుమీద కనిపించింది. ఎన్నికల ప్రకటన రాక ముందు నుంచే బీజేపీ లక్ష్యంగా తీవ్రదాడి చేసింది కాంగ్రెస్. ఆ పార్టీ చేసిన ఫార్టీ పర్సంట్ ఆరోపణలపై బీజేపీ వివరణ కూడా ఇచ్చుకోలేకపోయింది. రాహుల్‌గాంధీ భారత్‌జోడోయాత్ర దగ్గర నుంచి నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌కు అంతా హ్యాపీగానే కనిపించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలతో ఇక్కడ గ్యారెంటీ హామీలిస్తూ బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రతిఘటనతో బీజేపీ తన సిద్ధాంతాలనే పక్కన పెట్టింది. బీజేపీ చరిత్రలో లేని ఉచిత హామీ పథకాలను తొలిసారిగా కర్ణాటకలో అమలు చేస్తామని ప్రకటించడం ఓ విధంగా కాంగ్రెస్ విజయమేనని చెప్పాలి. కానీ, ఉన్నట్టుండి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.


బజరంగ్‌దళ్ నిషేధ వివాదంతో జోరుపెంచిన బీజేపీ

ఇన్నాళ్లు ప్రచారంలో జోరు చూపిన కాంగ్రెస్ రెండు రోజులుగా వివరణలు.. అనునయింపులకు చోటివ్వాల్సివచ్చింది. ప్రధాని మోదీ కర్ణాటకలోనే మకాం వేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. సుడిగాలి పర్యటనతో కర్ణాటకను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో (Congress Manifesto) విడుదలైన వెంటనే బజరంగ్‌దళ్ అంశాన్ని ప్రధాన ప్రచార అంశంగా మార్చేశారు మోదీ. ఓటు వేశాక ప్రతిఒక్కరూ జై బజరంగ్ బలి అని నినదించాలని కోరుతున్నారు మోదీ. అంతేకాదు తన ప్రసంగం ప్రారంభించే ముందు జై బజరంగ్‌బలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రజలతోనూ ఆ నినాదం చెప్పిస్తున్నారు. ఇది కాంగ్రెస్ స్వయం కృతమని.. ఆ పార్టీయే బీజేపీకి స్వయంగా ఓ ప్రచార అస్త్రాన్ని అందజేసినట్లైందని అంటున్నారు పరిశీలకులు.


వ్యూహంలో భాగంగానే..

కాంగ్రెస్ అయాచితంగానో.. అనాలోచితంగానో బజరంగ్‌దళ్ నిషేధిస్తామని ప్రకటించలేదనే వాదనా వినిపిస్తోంది. అన్నీ బేరీజు వేసుకునే ఈ ప్రకటన చేసిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. వాస్తవానికి ఓ సంస్థను నిషేధించడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు. కానీ, బీజేపీని రెచ్చగొట్టి ముస్లిం మైనార్టీ ఓట్లను తనవైపు తిప్పుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఆఖరి నిమిషంలో బజరంగ్‌దళ్ నిషేధాన్ని మ్యానిఫెస్టోలో చేర్చిందని చెబుతున్నారు.

Also Read: మల్లిఖార్జున్ ఖర్గే హత్యకు బీజేపీ ప్లాన్.. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.. స్పందించిన సీఎం

ముస్లిం ఓట్లు కీలకమే..
కర్ణాటకలో లింగాయత్, వొక్కలిగ ఓట్లతోపాటు ముస్లిం ఓట్లు కీలకమే. లింగాయత్‌లు బీజేపీకి.. వొక్కలిగలు జేడీఎస్‌కు మద్దతుగా నిలుస్తారనే భావన ఉంది. ఇదే సమయంలో సెక్యులర్ పార్టీగా ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడాల్సివుంది. కానీ, కర్ణాటకలో అలా జరగడం లేదు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటారు. కర్ణాటకలో మాత్రం ముస్లింలు సెక్యులర్ పార్టీగా జనతాదళ్‌ ఎస్‌ను ఎంచుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం కూడా ముస్లిం ఓట్లు జేడీఎస్‌కు పడేందుకు కొంత కారణమవుతున్నారు. ఇదే సమయంలో సుమారు 40 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI).. కూడా ముస్లిం ఓట్లను తన్నుకుపోతోంది. PFIని నిషేధించడంతో ఆ సంస్థ సభ్యులు SDPIకి అనుకూలంగా మారిపోయారు. ఇదే సమయంలో MIM పార్టీ 11 నియోజకవర్గాల్లో పోటీచేస్తోంది.


కాంగ్రెస్ కాళ్ల కిందకు నీరు

ఈ లెక్కలు పరిశీలించిన కాంగ్రెస్.. JDS, SDPI, MIMల నుంచి ముస్లిం మైనార్టీలను దూరం చేసి వారి ఓట్లు దక్కించుకోవాలనే ఏకైక అజెండాతో బజరంగ్‌దళ్ నిషేధ అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెబుతున్నారు. ఇది అటుతిరిగి.. ఇటు తిరిగి.. కాంగ్రెస్ కాళ్ల కిందకు నీరు తెస్తుందని ఆ పార్టీ నేతలు ఊహించలేకపోయారని అంటున్నారు విమర్శకులు. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోందని.. మ్యానిఫెస్టో విడుదల తర్వాత ఈ అంశంపై ఆ పార్టీ ఎక్కడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడం వివాదం జరగకుండా సేఫ్ జోన్‌ (safe zone)లో ఉండేలా చూసుకోవడమేనని అంటున్నారు పరిశీలకులు.

Also Read: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ‘ది కేరళ స్టోరి’ సినిమాను లేవనెత్తిన ప్రధాని మోదీ

ఎట్టిపరిస్థితుల్లో ఈ సారి విజయం సాధించాలని పోరాడుతున్న కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియాలంటే మే 13 వరకు వేచిచూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు. రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా, కన్నడ నాట హాట్‌డిబేట్‌గా మారిన బజరంగ్‌దళ్ ఎవరిని బలితీసుకుంటుందో.. ఎవరి తలరాత మారుస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు