ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్: ఆంధ్ర బస్సులపై దాడి

ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 75శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదికె(KRV) కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ 100 రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్‌కు 600వరకు సంఘాలు మద్దతును ప్రకటించాయి.
బంద్‌లో భాగంగా ఆంధ్రా బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చేయడం కలకలం రేపుతుంది. మంగళూరులో కొంతమంది నిరసనకారులు గురువారం ఉదయం 5.30గంటలకు తిరుపతి వెళ్లే బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఫరంగిపెటె ప్రాంతంలో బస్సుపై దాడి జరిగింది. అయితే ప్రయాణికులకు మాత్రం ఏమీ కాలేదు. మరోవైపు బంద్ కారణంగా కర్ణాటక యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని, ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ ప్రకటించినా స్కూళ్లు నడవట్లేదు.
కర్ణాటక రాష్ట్రంలో బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్దమని ప్రకటించారు.