BJP MLA Aravind Limbavali : కూతురు చేసిన పనికి పోలీసులకు క్షమాపణ చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే

కూతురు చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు.

bjp mla apologises afte daughter abuses cops : ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలు తమకు తండ్రికి పదవిలో ఉంటే..తామే అధికారంలో ఉన్నంత హడావిడి చేస్తారు.ముఖ్యంగా మగపిల్లలు తమ తండ్రులు, లేదా తాతలు లేదా బంధువులు అధికారంలో ఏంటే తామదే ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.ముఖ్యంగా వాహనాలు నడిపే విషయాల్లోను..ట్రాఫిక్ నిబంధనల విషయాల్లోను. అదే జరిగింది కర్ణాటకలో. ఓ ఎమ్మెల్యే కూతురు నిబంధనలు విరుద్ధంగా కారు నడిపింది చాలక ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసులపై అంతెత్తున ఎగిరిపడింది. నోటికొచ్చినట్లల్లా తిట్టిపోసింది. దీంతో తన కూతురు చేసిన పనికి సదరు ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబావళి కూతురు నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపినందుకుగాను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై ఒంటికాలుతో లేచింది. నోటికి పనిచెప్పి తిట్ల దండకం అందుకుంది. నోటికొచ్చినట్లల్లా తిట్టింది. ఈ దృశ్యాల్ని వీడియో తీస్తున్న మీడియాపై కూడా ఎగిరిపడిందామె.దురుసుగా ప్రవర్తించింది.

ఎమ్మెల్యే అరవింద్‌ కూతురు.. బెంగళూరులో గురువారం (జూన్ 9,2022)తన బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. దీంతో పోలీసులు ఆమె కారును ఆపారు. సిగ్నల్‌ క్రాస్‌ చేసినందుకు రూ.10 వేలు జరిమానా విధించారు. దీంతో ఆమెగారికి కోపం వచ్చింది. నాకారునే ఆపుతారా? నేను ఎవరో తెలుసా? నేను అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే లింబావళి కూతురుని అంటూ పొగరుగా వ్యవహరించింది. అయినా సరే ఫైన్ కట్టాల్సిందేనని పోలీసులు పట్టుపట్టారు. దీంతో ఆమెగారు ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు..ఇప్పుడు ఫైన్‌ కట్టను అంటూ మొండికేసింది. నా కారును విడిచిపెట్టాలని పోలీసులతో గొడవ పెట్టుకుంది.

ఈ వ్యవహారాన్నంతా రికార్డు చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ క్రమంలో కూతురి ప్రవర్తనకు బీజేపీ ఎమ్మెల్యే లింబావళి ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణలు చెప్పుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు