×
Ad

కుక్క కాటుతో చనిపోతే రూ.5లక్షలు.. గాయపడితే రూ.5వేలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Dog Bite వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5వేలు

Dog Bite

Dog Bite : దేశంలో అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల అనేక మంది గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలుసైతం కోల్పోతున్నారు. వీధి కుక్కుల బెడదతో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కుక్కల గాయాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి కర్ణాటక ప్రభుత్వం రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5వేలు పరిహారం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ ఐదు వేలల్లో రూ.3,500 నేరుగా బాధితుడికి అందజేస్తారు. మిగిలిన రూ.1500ను సురక్ష ట్రస్టు (కర్ణాటక ఆరోగ్య శాఖలో భాగం) కు చికిత్స ఖర్చుల కోసం కేటాయిస్తారు. 2023లో కూడా ఇలాంటి ఉత్తర్వునే జారీ చేశారు. కానీ, ప్రస్తుతం ఉత్తర్వుల్లో గాయపడిన వారికి పరిహారం చెల్లించే విధానంలో మార్పులు చేశారు.

కుక్క కాటుతో బాధితుడు ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రిలో తక్షణ చికిత్స పొందినా.. చికిత్సకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలోకి వచ్చే అన్ని మున్సిపాలిటీ కార్పోరేషన్లు కేసులను అంచనా వేయడానికి, పరిహారాన్ని పంపిణీ చేయడానికి ధృవీకరణ, పరిహార పంపిణీ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: Biggest Tunnel Gaza : భూమిలో కొత్త నగరం.. గాజాలో బయటపడ్డ భారీ సొరంగం.. బాప్‌రే.. ఇందులో ఎలాంటి సౌకర్యాలున్నాయంటే? వీడియో వైరల్

వీధి కుక్కల కేసులో ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా వీధి కుక్కలు లేవని నిర్ధరించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని పేర్కొంది. కుక్కల తరలింపునకు కోర్టు ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న ఆలనాపాలనా లేని పశువులను షెట్లర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్త్రీ బృందాలకు ఆదేశాలిచ్చింది.

దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడులో కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.