ఓన్లీ ఇంగ్లిష్.. మాతృభాషకు నో.. వామ్మో పిల్లలు ఏంటి ఇలా తయారవుతున్నారు? మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా?

మన భాషను మనం గౌరవిస్తేనే, మన పిల్లలు దాన్ని ప్రేమిస్తారు. ఈ బాధ్యత మనందరిపై ఉంది.

మీ పిల్లలు మీతో తెలుగులో మాట్లాడుతున్నారా? లేక ఎక్కువగా ఇంగ్లిష్‌లోనే సమాధానం ఇస్తున్నారా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందరో భాషాభిమానులకు వేధిస్తోంది. మాతృభాష పనికిరాదన్న తప్పుడు భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌ భాషను నేర్పించడంపైనే దృష్టి పెడుతున్నారు.

మైసూరుకు చెందిన గణేశ్ శంకర్ అనే వ్యక్తి తన పక్కింటి పిల్లాడి గురించి పెట్టిన ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్, ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ పిల్లాడు తన మాతృభాషైన తమిళం, కర్ణాటక భాష కన్నడ మాట్లాడకుండా కేవలం అమెరికన్ యాక్సెంట్‌తో ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సమస్య మీ ఇంట్లో కూడా ఉందా? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

ఆందోళన ఎందుకు?

ఈ ట్రెండ్‌పై చాలామంది తల్లిదండ్రులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇది మా ఇంట్లోనూ సమస్యే. మా పిల్లలు తమ తాతయ్య, నానమ్మలతో కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. పెద్దవాళ్లు వాళ్లకు అర్థం కాక ఇబ్బంది పడతారు” అని ఒక యూజర్ అన్నారు.

“ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలు మన భాష మాట్లాడకపోవడమే కాదు, మనం మాట్లాడితే చులకనగా చూసే పరిస్థితి వస్తోంది” అని మరో యూజర్ కామెంట్ చేశారు.

తల్లిదండ్రులు ఎందుకిలా చేస్తున్నారు?

ఈ మార్పునకు తల్లిదండ్రులే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

స్టేటస్ సింబల్: పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే సమాజంలో ఒక స్టేటస్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు.

ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్: తమ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడకపోతే, ఇతరుల ముందు తక్కువైపోతారనే భయం కొందరిలో ఉంది.

ఫ్యూచర్ ప్లాన్స్: పిల్లలను భవిష్యత్తులో విదేశాలకు పంపాలనే ఆలోచనతో, చిన్నప్పటి నుంచే కేవలం ఇంగ్లీష్‌పైనే దృష్టి పెడుతున్నారు.

కోల్పోతున్నది కేవలం భాషేనా?

ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం కాదని, అంతకుమించి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు మాతృభాషకు దూరమైతే:

సంస్కృతికి దూరం: మన పండుగలు, సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న కథలు వారికి అర్థం కావు.

బంధాలకు దూరం: తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో భావోద్వేగపూరితమైన బంధం ఏర్పడదు.

వీటికీ దూరం: తమ కుటుంబ చరిత్ర, మూలాలు, గుర్తింపును పూర్తిగా కోల్పోతారు.

విదేశాల్లో మనవాళ్లు బెటర్!

విచిత్రం ఏంటంటే, ఈ సమస్య ఇండియాలో ఉన్నంతగా విదేశాల్లో లేదు.

ఆస్ట్రేలియా నుంచి ఒకరు స్పందిస్తూ: “మేము మెల్‌బోర్న్‌లో ఉంటాం. మా పిల్లలు ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడతారు. ఇక్కడ ప్రభుత్వమే మన భాష నేర్పించడానికి వీలు కల్పిస్తోంది. కానీ ఇండియాలో ఉన్న మా బంధువుల పిల్లలు మాత్రం తెలుగు మాట్లాడటం లేదు” అని అన్నారు.

మరి పరిష్కారం ఏంటి?

ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలు సూచిస్తున్నారు. బయట ఏ భాష మాట్లాడినా, ఇంట్లో కచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలతో మాతృభాషలోనే సంభాషించాలి. మన భాషలోని చిన్నపిల్లల కథలు, పాటలు, సరదా సినిమాలను వారికి పరిచయం చేయాలి. పిల్లలు తప్పుగా మాట్లాడినా విమర్శించకుండా, ప్రేమగా సరిదిద్ది ప్రోత్సహించాలి.

ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పు కాదు, అది అవసరమే. కానీ ఆ వ్యామోహంలో మన అమ్మ భాషను, మన మూలాలను మర్చిపోవడం చారిత్రక తప్పిదం. మన భాషను మనం గౌరవిస్తేనే, మన పిల్లలు దాన్ని ప్రేమిస్తారు. ఈ బాధ్యత మనందరిపై ఉంది.